సంధ్య థియేటర్ ఘటనపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో ఈ వ్యవహారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. అల్లు అర్జున్ అత్యుత్సాహం, పోలీసుల మాట వినకపోవటం వల్లే రేవతి అనే మహిళ చనిపోవటమే కాకుండా ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారని రేవంత్ అసెంబ్లీ వెల్లడించారు. రేవంత్ కామెంట్లపై అల్లు అర్జున్ సైతం స్పందించారు. శనివారం రాత్రి ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. సీఎం వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తేనే తాను థియేటర్‌కు వెళ్లాలని.. రేవతి చనిపోయిన విషయం తనకు మర్నాడు తెలిసిందన్నారు.
కాగా, అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్లపై తాజాగా హైదరాబాద్ సీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఆ రోజు థియేటర్ వద్ద ఏం జరిగిందో మీడియాకు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో దృష్యాలను కూడా మీడియాకు చూపించారు. ప్రత్యక్ష సాక్షి, డ్యూటీలో ఉన్న చిక్కడపల్లి ఏసీపీ రమేష్ ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడించారు. ఏసీపీ రమేష్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. 'అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌కు ముందు తెలియజేశాం. ఒక లేడీ చనిపోయారు.. ఓ పిల్లాడు తీవ్ర గాయాల పాలయ్యాడు.. పరిస్థితి కంట్రోల్‌లో లేదని చెప్పాం. మీకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పాం. ముందు అల్లు అర్జున్ మేనేజర్ మమ్మల్ని కలవనివ్వలేదు. మేం అల్లు అర్జున్‌కు చెబుతామని సంతోష్ అన్నారు. కానీ వారు వెళ్లలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ వచ్చారు.
డీసీపీ సార్ సూచనతో వాళ్లను నెట్టుకుంటూ నేను అల్లు అర్జున్ వద్దకు వెళ్లాను. అల్లు అర్జున్ చెవిలో చెప్పాను. ఓ లేడీ చనిపోయిదని.. పిల్లాడు గాయపడ్డాడని చెప్పాను. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని.. పోలీసులు రూట్ క్లియర్ చేశామని ఆయనకు చెప్పాం. అయినా అల్లు అర్జున్ వినిపించుకోలేదు. సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారు. అప్పుడు మా డీసీపీ సార్‌కు చెప్పాం. అప్పుడు సార్, మేం మరోసారి లోపలికి వెళ్లాం. ఓ 10-15 నిమిషాలు టైం ఇచ్చాం. ఆ తర్వాత ఆయన్ను బయటకు తీసుకొచ్చాం. వాస్తవంగా జరిగింది ఇదే.' అని రమేష్ వెల్లడించారు.
ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పర్మిషన్ లెటర్‌పై కూడా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తాము థియేటర్ యాజమాన్యానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. లెటర్ ఓ వైపు మాత్రమే వైరల్ చేస్తున్నారు. పర్మిషన్ లెటర్ వెనకాలే కుదరని రాసినట్లు స్టేషన్ ఎస్‌ఎచ్‌వో రాజు నాయక్ వెల్లడించారు. తాను ఓరల్‌గా కూడా వారికి పర్మిషన్ లేదని చెప్పినట్లు తెలిపారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పడి వరకు అల్లు అర్జున్ చెప్పినదంతా అబద్ధమని.. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.