హైదరాబాదులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నివాసం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు అల్లు అర్జున్ నివాసంలోకి రాళ్లు, టమాటాలు విసిరారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ నివాసంలోకి వెళ్లారు. విద్యార్థి సంఘాల ముట్టడి జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అటు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా తన అల్లుడి నివాసానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆయన ఆరా తీశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. సీఎం వ్యాఖ్యలకు స్పందనగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టడంతో వాతావరణం వేడెక్కింది. ఇవాళ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో, ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడంలేదు.