తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ప్రకటించి వారికి పథకాలను వర్తింపచేయునుంది. ఈనెల 21 నుండి 24 వరకు అనంతగిరి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ సభలను ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతోపాటు, లిస్టులో పేరు రాని వారి సైతం మరలా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితాను ప్రకటించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు.
ఈ ఎంపిక చేసిన గ్రామంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు శనివారం సాయంత్రం సర్వే చేశారు. పైలట్ ప్రాజెక్టు గ్రామం విజయవంతమైన అనంతరం అన్ని గ్రామాలకు అర్హులను ఎంపిక చేసి పథకాలను అందించనున్నారు. అనంతగిరి మండలంలో పైలట్ ప్రాజెక్టు గ్రామంలో లక్కవరం ఎంపికచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.