ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపులో బిడ్డ నుంచి...కాటి వరకు మనదే భాద్యత: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితకుమారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 04:57 PM

జోగిపేట: కడుపులో ఉన్న బిడ్డ నుంచి...కాటి వరకు మనదే భాద్యతయని వారిని రక్షించుకోవాల్సిన భాద్యత మనపై ఉందని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితకుమారి అన్నారు. జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జోగిపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సమావేశానికి సీడీపీఓ ప్రియాంక అధ్యక్షత వహించారు.  జిల్లాలో బాల్యవివాహాలు జరగకూడదనే లక్ష్యంగా మనమంతా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని, అందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్‌ పొటెక్షన్‌ కమిటీ సభ్యులంతా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. గత సంవత్సరం 48 బాల్య వివాహాలను అడ్డుకోగలిగామని, 2025వ సంవత్సరంలో ఒక్క వివాహం కూడా జరగడానికి వీలు లేకుండా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఈ విషయంలో గ్రామంలో   ప్రజలకు  అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో 9,10 తరగతులకు చెందిన విద్యార్ధినిల డాటాను సేకరించాలని, అంతే కాకుండా, పాఠశాల మానేసిన వారి వివరాలు కూడా తెలుసుకోవాలన్నారు. అంగన్‌వాడీ టీచర్‌ కన్వీనర్‌గా ప్రొటెక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, అందులో సభ్యులుగా   పంచాయతీ సెక్రటరీ, రిటైర్డ్‌  సైన్స్‌టీచర్, పోలీసు అధికారులతో కలిపి మొత్తం 9 ప్రభుత్వ శాఖలకు చెందిన సభ్యులుండాలన్నారు. మహిళలపై ఎక్కడా అఘాయిత్యాలు జరగకుండా, ర్యాగింగ్‌ జరగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మాయిల రక్షణ, చదువు చాలా ముఖ్యమైనదన్నారు. ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా అవకాశాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగపరచుకోవాలన్నారు. చదువుకునేందుకు ప్రభుత్వం కేజీబీవీ, గురుకుల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. బాలికలు తమకు తాము స్థిరపడ్డ తర్వాతనే  పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు. ప్రత్యేక అవసరాలు కావాల్సిన వారికి కూడా తాము అన్ని విధాలుగా సహకరిస్తున్నామన్నారు. వృద్దులైన తర్వాత తల్లిదండ్రులను వదిలేసి వారిని ఇబ్బంది పెట్టిన వారికి కూడా తమ వైపు నుంచి సహయ సహకారాలు అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల ఆలనా, పాలనా చూసుకునేందుకు సంగారెడ్డి, నారాయణఖేడ్‌లల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. కేజీబీవీలో చదువుకుంటున్న అనాధ పిల్లలను సెలవుల్లో ఈ కేంద్రాలకు పంపి డ్రాయింగ్, డ్యాన్సింగ్‌ వంటి కళలను కూడా నేర్పిస్తామన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను చేరదీసిన వారికి ఇబ్బంది కలగకుండా పిల్లలపై ప్రతి నెల రూ.4వేల చొప్పున వారి అక్కౌంట్‌లలో వేస్తామన్నారు.  సదస్సుకు హజరైన వారిచే ప్రతిజ్ఞ చేయించారు.  సీడీపీఓ ప్రియాంక, ప్రాజెక్టు పరిధిలోని సూపర్‌వైజర్లు,  తాలెల్మ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, అంగన్‌వాడీ, ఆశ, డ్వాక్రా గ్రూపు మహిళలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa