ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ లైఫ్ సెన్సెస్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్న రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 04:22 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నౌకాశ్రయాన్ని కలిపేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న బయో ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారిందని అన్నారు. ఈ సదస్సుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు వచ్చిందని పేర్కొన్నారు.హైదరాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధ ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని అన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యపై పెట్టుబడులు బాగా పెరిగాయని వివరించారు. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను తయారుచేశామని పేర్కొన్నారు. నిపుణుల కృషితో జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు.పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మారుస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ సహా భారీ ప్రాజెక్టులు వస్తున్నట్లు చెప్పారు. భారత ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా హైదరాబాద్ మారిందని అన్నారు. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాల విక్రయం హైదరాబాద్‌‍లోనే నమోదవుతోందని అన్నారు. తెలంగాణ ఆర్టీసీలోకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామని ఆయన అన్నారు.ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా చేస్తామని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటి అనేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్‌ను రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తామని అన్నారు. రేడియల్ రోడ్లకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో మెగా డ్రైపోర్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఆవిష్కరణలు పరిశోధన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా హైదరాబాద్ మారాలని ఆకాంక్షించారు. అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించిందని తెలిపారు. ఆయా కంపెనీలు ఇక్కడి అనుకూలతలను, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని దిగ్గజ కంపెనీలను కోరుతున్నామని అన్నారు. సులభతర పారిశ్రామిక విధానంతో మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.దేశ విదేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దావోస్ వేదికగా రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు. విభిన్న రంగాల్లో 50 వేల ఉద్యోగాలు రానున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. లైఫ్ సైన్సెస్‌లో గత ఏడాది రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని అన్నారు. 150కి పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు వచ్చాయన్నారు.ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గ్రీన్, ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఎంవోయూలు చేసుకున్నట్లు చెప్పారు. మరో నాలుగు ఎంఎన్‌సీలకు స్వాగతం పలుకుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పాతికేళ్లుగా హైదరాబాద్‌కు ఫార్మా, ఐటీ, డిజిటల్, హెల్త్ పవర్ హౌస్‌గా పేరు ఉందని ఆయన అన్నారు. ఏఐ హెల్త్ కేర్ సమ్మిట్‌ను గత ఏడాది విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa