ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు,,, రేవంత్ రెడ్డి సర్కార్ తీపికబురు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 05:54 PM

శ్రీరామనవమి పర్వదినం వేళ రేవంత్ రెడ్డి సర్కార్ తీపికబురు వినిపించింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో సాగునీటి సరఫరా పెంపులో కీలకంగా నిలిచే సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇది జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి కొత్త దిశను సూచిస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7,926 కోట్ల అంచనాతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసి ప్రారంభించింది. ఆ తరువాత పథకంలో పలు మార్పులు చేసింది. ముఖ్యంగా సీతమ్మ బ్యారేజీని కూడా ఈ పథకంలో భాగంగా చేర్చడంతో, 2018 ఆగస్టులో అంచనాలను రూ.13,057 కోట్లకు పెంచారు.


తాజాగా ఈ ప్రాజెక్టులో మరింత విస్తరణ అవసరమై, నూతన అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324.92 కోట్లకు సవరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై రూ.10 వేల కోట్లకు పైగా వ్యయం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.


సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 4,15,621 ఎకరాల భూమికి సాగునీరు అందించటమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరొక 3,89,366 ఎకరాలను స్థిరీకరించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ మూడు జిల్లాల రైతులకు సాగు ఇబ్బందులు తీరనున్నాయి. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధ్యమవనుంది.


రైతులతో పాటు విద్యారంగానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే ఉన్న మైనింగ్ కాలేజీని "ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా" అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. దీనివల్ల భూగర్భ వనరులు, భూవిజ్ఞానం, పర్యావరణ శాస్త్రాలపై ప్రాధాన్యంతో విద్యను అభివృద్ధి చేసే అవకాశాలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ద్వారా విద్యార్థులకు అధునాతన విద్యావకాశాలు, పరిశోధనలకు స్థానం, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే మార్గాలు తలుపులు తెరవనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa