హైదరాబాద్‌లోని రీజినల్ రింగు రోడ్డుకు సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. స్థానికులకు ఉపయోగపడేలా సర్వీసు రోడ్ల అవసరం ఉందని ప్రజాభిప్రాయ సేకరణ సభల్లో వచ్చిన నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పొడవునా సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎన్ హెచ్ఏఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరనుందని భావిస్తోంది. మొదట సర్వీసు రోడ్లు అవసరం లేదని భావించినప్పటికీ.. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఎన్ హెచ్ఏఐతన నిర్ణయాన్ని మార్చుకుంది.
హైదరాబాద్ నగరం చుట్టూ ఇప్పటికే నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును సర్వీసు రోడ్లతో కలిపి నిర్మించారు. కాగా.. ఈ సర్వీస్ రోడ్లు వాహనదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. కాగా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌కు కూడా సర్వీసు రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. మొదట రూపొందించిన ప్రాజెక్టు డిజైన్‌లో సర్వీసు రోడ్డు ప్రస్తావన లేదు. దీనిని సాధారణ జాతీయ రహదారిలా కాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మిస్తున్నారు. అందుకే సర్వీసు రోడ్లు అవసరం లేదని తొలుత నిర్ణయించారు.
అయితే సర్వీసు రోడ్లు లేకపోతే తమకు ఉపయోగం ఉండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా సర్వీసు రోడ్లు కావాలని ప్రజాభిప్రాయ సేకరణ సభల్లో కోరుతున్నారు. మొదట ప్రజల అభ్యర్థనను ఎన్ హెచ్ఏఐ తోసిపుచ్చింది. కానీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్ హెచ్ఏఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రోడ్డు డిజైన్‌ను మార్చి సర్వీసు రోడ్డు ఆప్షన్‌ను చేర్చింది.
కీలక ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించడానికి వాటిని పీఎం గతి శక్తి పర్యవేక్షణలో ఉంచుతున్నారు. పీఎం గతి శక్తిలో భాగంగా ఉన్న నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఇటీవల సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. కొత్త సెజ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లు వస్తాయని అంచనా వేశారు. అప్పుడు స్థానిక ప్రజల కోసం సర్వీసు రోడ్లు అవసరం అవుతాయని ఎన్పీజీ అభిప్రాయపడింది.
ఈ రోడ్డు నిర్మించే ప్రాంతంలో ట్రాఫిక్ సర్వే చేస్తున్నారు. స్థానిక రోడ్లపై ప్రస్తుతం వాహనాల రద్దీ ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. 2021–22లో నిర్వహించిన ట్రాఫిక్ స్టడీతో పోలిస్తే కొత్త అధ్యయనంలో వాహనాల సంఖ్య పెరిగితే, రాబోయే ఐదారేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన రహదారి మీదుగా కాకుండా, ఇతర రోడ్లతో కలిసే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుందని అంచనా వేశారు. సర్వీసు రోడ్లు లేకపోతే ఆ వాహనాలకు ఈ రోడ్డు ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం చేస్తున్న ట్రాఫిక్ స్టడీలో వాహనాల సంఖ్య బాగా పెరిగితే సర్వీసు రోడ్లు కచ్చితంగా నిర్మించాలనిఎన్ హెచ్ఏఐకి సిఫారసు చేశారు. వాహనాల సంఖ్య బాగా పెరిగిందని అంచనాకు వచ్చిన తరువాత, సర్వీసు రోడ్లు నిర్మాణానికి వీలుగా ఆర్ఆర్ఆర్ డిజైన్లు సిద్ధం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్‌కు రెండు వరుసల సర్వీసు రోడ్డును డిజైన్ చేస్తున్నారు. మొదట 5.5 మీటర్లతో ఒక వరుస సర్వీసు రోడ్డును నిర్మించాలని అనుకున్నారు. వాహనాల రద్దీ పెరిగిన తర్వాత దాన్ని 7.5 మీటర్లకు, రెండు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. సర్వీసు రోడ్లు ఫ్లైఓవర్లు ఉన్న చోట ఉండవు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఉన్న చోట వాటి దిగువగా నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసే చానళ్ల ద్వారా యూ టర్న్ తరహాలో ఉండి మళ్లీ ప్రధాన రహదారిని ఆనుకుని ముందుకు వెళ్తాయి.
ప్రధాన రహదారి, దిగువ ప్రాంతాలకు కేటాయించిన అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ట్రాఫిక్ స్టడీ వివరాలను కేంద్రానికి పంపిన తర్వాత, ఢిల్లీ అధికారులు పరిశీలిస్తారు. ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుని స్థానిక NHAI అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. ట్రాఫిక్ స్టడీ వివరాలను కేంద్రానికి సమర్పించిన తర్వాత, ఢిల్లీ స్థాయిలో అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుని స్థానిక ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa