ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. రికార్డుస్థాయి ఏర్పాట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 06:40 PM

ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి.. ఎన్ని అడ్డంకులు, మరెన్ని అవహేళనలు ఎదురైనా ఉద్యమమే ఊపిరిగా, రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆశనే శ్వాసగా పోరాడి చివరకు అనుకున్న లక్ష్యాన్ని ముద్దడింది తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్.. రాష్ట్రం సిద్ధించిన తర్వాత.. ఒక్కసారి కాదు రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కాగా.. 2022లో టీఆర్ఎస్‌ను పార్టీ అధినేత కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. రజతోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభగా నిలిచిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో రేపు (ఏప్రిల్ 27న) నిర్వహించనున్నారు. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరానుండగా.. బీఆర్ఎస్ పార్టీ రికార్డుస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భంగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.


రికార్డుస్థాయి ఏర్పాట్లు, విశేషాలు..


ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించాలన్న లక్ష్యంతో రికార్డు స్థాయి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. 154 ఎకరాల్లో ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. 500 మంది ముఖ్యనేతలు కూర్చునేలా భారీ వేదికను రూపొందించారు. 1,059 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని కేటాయించారు.


వేసవి తీవ్రత దృష్ట్యా.. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు. 6 అంబులెన్స్‌లు, 12 వైద్య శిబిరాలు, 1,200 తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ నిర్వహణ కోసం 2,000 మంది వాలంటీర్లు నిరంతరం పని చేయనున్నారు. అంతేకాదు.. విద్యుత్ అంతరాయం కలగకుండా 250 జనరేటర్లను ఏర్పాటు చేయటం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంట్‌ మీద నమ్మకం లేకనే.. ఇలా 250 జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేయటం గమనార్హం.


లక్షలాదిగా తరలిరానున్న జనసందోహం, పార్టీ శ్రేణుల ఉత్సాహం..


ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలిరానున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. గులాబీ జెండాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో వరంగల్ నగరం మార్మోగనుంది. ఇప్పటికే.. జనసమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టిన గులాబీ పార్టీ అందుకు తగ్గట్టుగానే.. 3000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంది పార్టీ. అన్ని జిల్లాల నుంచి జనాలను వరంగల్ సభకు తీసుకొచ్చేలా ఈ బస్సులను ఉపయోగించనున్నారు. ఈ బస్సులే కాకుండా.. డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు ఇలా వేల సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్‌లతో జనాలను తరలించనున్నారు. కాగా.. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపనుంది.


రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించిన జీహెచ్ఎంసీ.. అంతు చూస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్..


ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగాలు చేయనున్నారు. అయితే.. చాలా రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన గులాబీ బాస్.. ఆయా జిల్లాల నేతలతో చర్చలు జరుపుతున్నప్పటికీ.. తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడింది మాత్రం పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే. ఇక.. అప్పటి నుంచి రాష్ట్రంలో చాలా మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. కేసీఆర్ చేయబోయే ప్రసంగం గురించి రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన, పథకాల అమలు, కాంగ్రెస్ నేతల విమర్శలు ఇలా అన్నింటిపై కేసీఆర్ ఎలా స్పందించబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో.. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికలను కూడా ఇదే వేదిక నుంచి కేసీఆర్ వివరించనున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa