ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ కు వ్యంగ్యంగా వెల్‌కమ్ చెప్పిన ఎమ్మెల్సీ కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 06:45 PM

భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌ HICCలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన 450 మందికి పైగా ప్రతినిధులు, 40 నుంచి 50 మంది మంత్రులు, 50 మంది పార్లమెంటు సభ్యులు, 100 మంది రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. నేడు సదస్సు ఆఖరి రోజు కాగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆయనకు వ్యంగంగా వెల్‌కమ్ చెప్పింది. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఆమె ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ మోసగించారంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.


దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం. మోసపూరిత హామీలు.. అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్ నగరానికి వస్తున్న రాహుల్‌ గాంధీ గారికి సుస్వాగతం. మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ 16 నెలల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టింది. హైడ్రా, మూసీ పేరుతో పేద ప్రజల మీదికి బుల్డోజర్లు పంపింది. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టింది. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించింది. రేవంత్‌ రెడ్డి గారి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నిర్దారించింది.


కరెంట్‌ పోయిందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు.. అక్రమ కేసులు.. అరెస్టులు. ఈ హైదరాబాద్‌ పర్యటనలో మీరు హెచ్‌సీయూను సందర్శించి లాఠీ దెబ్బలు తిన్న, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించండి. తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియాగాంధీ గారిని, మీ సోదరి శ్రీమతి ప్రియాంకా గాంధీ గారిని.. మిమ్మల్ని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారు.


బిహార్‌లో విద్యార్థుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు.. తెలంగాణలో గ్రూప్‌ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు, గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటి ? డిసెంబర్ 9 , 2023 న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు.. అయినా మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు రూ.2500 ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారు?


ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ.. దమనకాండ కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.. మీ మౌనం దేనికి సంకేతం?' అని కవిత ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa