ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 09:13 PM

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 11 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు నేడు ఈ లేఖను సీఎంకు పంపించారు. చార్జీల పెంపు నగరవాసులపై, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.తమ లేఖలో, బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మెట్రో రైలు సేవలను లక్షలాది మంది ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రధాన రవాణా మార్గంగా వినియోగిస్తున్నారని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో టికెట్ ధరలను పెంచాలని చూడటం వల్ల, నిత్యం ప్రయాణించే వారిపై ఇది పెనుభారంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై ఈ పెంపు మరింత భారం వేస్తుందని అన్నారు. టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచితే, ఒక సాధారణ ప్రయాణికుడి నెలవారీ ఖర్చు కనీసం రూ.500 నుంచి రూ.600 వరకు పెరుగుతుందని, ఇది కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తుందని వివరించారు.ప్రజా రవాణా వ్యవస్థల ప్రాథమిక ఉద్దేశం ప్రజలకు చవకైన, వేగవంతమైన, నమ్మకమైన సేవలు అందించడమేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ప్రజా రవాణా వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. సింగపూర్, బెర్లిన్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి ప్రజా రవాణాను ప్రోత్సహిస్తున్నాయని గుర్తు చేశారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఉన్న హైదరాబాద్‌లో కూడా ప్రజా రవాణాను బలోపేతం చేసి, తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.ప్రైవేటు కంపెనీల లాభాల కోసం కాకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో నడవాలన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. టికెట్ ధరల పెంపు వల్ల ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఆశ్రయించే అవకాశం ఉందని, ఇది నగరంలో ట్రాఫిక్, కాలుష్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోటల్లా మెట్రో ధరలను పెంచేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోందని, బెంగళూరులో మెట్రో చార్జీలను 100 శాతం పెంచడంతో ప్రయాణికుల సంఖ్య 13 శాతం తగ్గిందని వారు ఉదహరించారు.తీవ్ర ప్రజా వ్యతిరేకత రావడంతో అక్కడి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ధరల పెంపును వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గి, నగర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలకు అవసరమైన మార్గాల్లో నిర్దేశించిన మెట్రో రైలు ప్రాజెక్టులను రద్దు చేయడం ప్రజా రవాణా వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు.ప్రస్తుతం ఉన్న మెట్రో రైలును సమర్థంగా నడపలేని ప్రభుత్వం, మెట్రోను విస్తరిస్తామంటూ చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున, మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీల లాభనష్టాల ప్రాతిపదికన కాకుండా, ప్రజా కోణంలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే రాజధాని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని తమ లేఖలో హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa