భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రస్తుతం యూకే పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై కీలక సందేశాన్నిచ్చారు. ఇంగ్లాండ్‌లోని వార్విక్ యూనివర్సిటీలో పీడీఎస్‌ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డలు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు సేవలు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని, 'ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్' అన్నదే తమ విధానమని పునరుద్ఘాటించారు. పెట్టుబడులు ఆకర్షించి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతామన్నారు.
ఆటోమొబైల్ రంగంలో తెలంగాణ సత్తా..
ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ సాధించిన విజయాలపై ఎల్లప్పుడూ గర్వంగా మాట్లాడతానని తెలిపారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన పీడీఎస్‌ఎల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఆటోమొబైల్ రంగంలో ఆ సంస్థ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పీడీఎస్‌ఎల్ తమ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని కేటీఆర్ కోరారు. ఇంగ్లాండ్‌లో యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య ఉన్న పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ సంస్థ, వార్విక్ యూనివర్సిటీలో తన నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించడం తెలంగాణ టాలెంట్‌కు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే ఆటోమోటివ్ హబ్‌గా పూణే, చెన్నైల సరసన హైదరాబాద్ నిలిచిందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఐటీ, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందని, కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కే పరిమితం కాకుండా తయారీ రంగంలోనూ తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు తెచ్చిన పాలసీలు ఉపయోగపడతాయని వివరించారు. భారతదేశంలో ఫార్ములా E రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేస్తూ.. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేసిందన్నారు.
గ్లోబల్ గుర్తింపు, భవిష్యత్ లక్ష్యాలు
తమ ప్రభుత్వ నిరంతర కృషితో తెలంగాణ అంతర్జాతీయ కంపెనీలకు కొత్త చిరునామాగా మారిందని కేటీఆర్ తెలిపారు. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ప్రారంభించాయని గుర్తుచేశారు. తమ తొమ్మిదేళ్ల కాలంలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతో పాటు ఇతర రంగాల్లోనూ తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందన్నారు. ఐటీ, దాని అనుబంధ రంగాలతో పాటు ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లోనూ భారతీయ యువత తమ ప్రతిభ, నిబద్ధతతో అద్భుతంగా రాణిస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, విద్యార్థులతో పాటు కంపెనీలు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు.
పీడీఎస్‌ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల మాట్లాడుతూ, కేటీఆర్ ఆలోచనలు, పనితీరు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. ఆయన చేసిన పనులు, తీసుకొచ్చిన విధానాలు, ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగానికి చేసిన కృషి వల్ల ఐటీ ఒక్కటే కాదు అనేక రంగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలబడిందన్నారు. అనేక దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి, తన పనితీరు, ఆలోచనా దృక్పథంతో గ్లోబల్ లీడర్‌గా ఎదిగిన కేటీఆర్ చేతుల మీదుగా తమ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించుకోవడం తమ కంపెనీకి అత్యంత గౌరవం అన్నారు. నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం, అక్కడ జరిగే కార్యకలాపాలను కేటీఆర్ పరిశీలించారు. తమ సంస్థ గురించి పీడీఎస్‌ఎల్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. ఆ తర్వాత కంపెనీ సిబ్బంది, ఉద్యోగులతో కేటీఆర్ సంభాషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa