ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నత విద్య పూర్తి చేసుకుని మనదేశంలో కంపెనీలు స్థాపించండి : కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 11:18 AM

అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామన్నారు. అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురి అవుతుందన్నారు. అందుకే విద్యార్థులకు అండగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే విద్యార్థులు కూడా అమెరికా చట్టాలను అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసులుకోవాలని సూచించారు. స్థానిక చట్టాలతో పాటు ఇక్కడి పరిస్థితులను ప్రతీ ఒక్క విద్యార్థి అవగాహన చేసుకోవాలన్నారు. ఈరోజు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డల్లాస్ లో చదువుకుంటున్న విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అమెరికా పోవాలన్నా, చదువుకోవాలన్నా ఎన్నో వ్యయ, ప్రయాసలకు గురయ్యే వాళ్ళమన్న కేటీఆర్, ప్రపంచం వేగంగా మారిపోయి ఇప్పుడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దాంతోపాటే అమెరికా విద్య కూడా అనేక మందికి అందుబాటులోకి వచ్చిందన్నారు. 


కేవలం ర్యాంకుల కోసమో, గ్రేడ్ల కోసమో కాకుండా జీవితంలో సాధించాల్సిన ప్రధాన లక్ష్యాల పైన దృష్టి పెట్టాలన్నారు. చూస్తుండగానే మనిషి జీవితంలో 50 సంవత్సరాలు పూర్తి అవుతాయని ఇంత స్వల్ప కాలంలోనే తమ కలలు, ఆకాంక్షలను అందిపుచ్చుకోవాలన్నారు. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా, మనతోనే ఉన్న వ్యక్తులు వెనక్కి లాగినా నిబద్ధతతో ముందుకు పోవాలన్నారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయన్న కేటీఆర్, ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే కలలు సాకారం అవుతాయి అనడానికి కేసీఆర్ గారి జీవితమే సాక్ష్యమన్నారు. రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం మొదలుపెట్టిన రోజు అనేకమంది ఆయనను అవహేళన చేశారని చెప్పారు. కానీ 14 సంవత్సరాల నిరంతర పోరాటం  తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిపై  ప్రశంసలు కురిపించారన్నారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. అమెరికాలో చదువుకుని ఇండియాకి తిరిగి వచ్చి కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. మనదేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మేథోవలస (Brain drain) మన దేశానికి పెను సవాలుగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లో చదువుకుంటున్న యువత భాగం కావాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa