తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. బస్ పాస్ ధరలను భారీగా పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్‌పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచారు. నేటి నుంచి కొత్త బస్ పాస్ ధరలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.1150 ఉన్న ఆర్డీనరీ బస్ పాస్ ధరను రూ.1400కు పెంచారు. ప్రస్తుతం రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ ధరను రూ.1600కు పెంచారు. రూ.1450గా ఉన్న మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర రూ.1800కు పెరిగింది.
ఈ ధరల పెరుగుదలపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉద్యోగులు, దినసరి కూలీలు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు రోజువారీ ప్రయాణానికి ఈ బస్ పాసులను ఉపయోగిస్తారు. పెంచిన ధరలు వారి నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు బస్ పాస్ ధరలు తమ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుందని అంటున్నారు.
ఇక ఇటీవల హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను కూడా పెంచారు. ఏడున్నరేళ్ల తర్వాత తొలిసారిగా ధరల పెంపును L&T మెట్రో రైల్ లిమిటెడ్ మే 17 నుంచి అమలులోకి తెచ్చింది. ముందుగా 20 శాతం టికెట్ ధరలను పెంచారు. అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన వ్యతిరేకత, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పెరిగిన ధరలపై 10 శాతం రాయితీని మే 24 నుంచి ప్రకటించింది. దీంతో చాలా మంది మెట్రోకు బదులుగా బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచటంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 12వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్తను అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త బస్ పాస్‌ల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న 40 ఆర్టీసీ కేంద్రాల్లో విద్యార్థులు ఈ బస్ పాస్‌లను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కొత్త బస్ పాస్‌ల కోసం విద్యార్థులు ముందుగా www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకుని, దానికి అవసరమైన ధృవపత్రాలను జతచేసి తమకు దగ్గరలో ఉన్న బస్ పాస్ కౌంటర్లలో సమర్పించాలి. ఆ తర్వాత వారికి స్టూడెంట్ బస్ పాస్ అందజేస్తారని ఆర్టీసీ అధికారులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa