గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా వీధి కుక్కల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు కనిపించకుండా.. వాటిని షెల్టర్లలోకి తరలించాలని ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత జంతు ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఈ తీర్పును పరిశీలించనున్నట్లు స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. రేబిస్ కారణంగా 2 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. బుదౌన్ జిల్లాలోని సుజత్‌గంజ్ బేలా గ్రామానికి చెందిన మహమ్మద్ అద్నాన్ అనే 2 సంవత్సరాల బాలుడు.. ఇటీవల రేబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడికి గతంలో ఓ గాయం అయిందని.. అయితే ఆ గాయాన్ని నెల రోజుల క్రితం ఒక వీధి కుక్క నాకినట్లు మహమ్మద్ అద్నాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆ సమయంలో కుక్క కాటు వేయలేదని.. కేవలం నాకిందని భావించిన బాలుడి తండ్రి మహ్మద్ అనీస్ దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. కానీ అదే వారి పాలిట పెను శాపంగా మారింది. వీధి కుక్క నాకడంతో దాని లాలాజలం నుంచి.. ఆ బాలుడికి రేబిస్ వ్యాధి సోకినట్లు.. ఆ తర్వాత నిర్ధారించారు.
కొన్ని రోజుల తర్వాత మహమ్మద్ అద్నాన్ విచిత్రంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ బాలుడిలో రేబిస్ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రేబిస్ తీవ్రస్థాయికి చేరుకున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. చివరికి చికిత్స పొందుతూ ఈ ఘటన జరిగిన నెలరోజుల తర్వాత అద్నాన్ చనిపోయినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ ఘటన మరోసారి వీధి కుక్కల స్వైర విహారంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఆ గ్రామంలోని సుమారు 30 మంది రేబిస్ టీకా తీసుకున్నట్లు స్థానికులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa