ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూకట్‌పల్లి సహస్ర హత్య కేసు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 07:30 PM

హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12ఏళ్ల సహస్ర హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. కూకట్‌పల్లిలో నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న సహస్ర హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో జరిగిన ఈ ఘటనలో తొలుత పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేక తలలు పట్టుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులను ప్రశ్నించినా స్పష్టమైన క్లూస్‌ దొరకలేదు. ఈలోగా సహస్ర తండ్రి కృష్ణపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయనను విచారణకు తీసుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందిస్తూ ‘కూతుర్ని ఆప్యాయంగా చూసుకునే తండ్రి ఇలాంటిదానికి పాల్పడడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజాగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. స్థానికుల సహకారంతో దర్యాప్తు మలుపుతిప్పి, చివరికి పదో తరగతి చదివే ఓ బాలుడే ఈ ఘాతుకానికి కారణమని నిర్ధారించారు. ఇతడు సహస్ర ఇంటికి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్నాడు. మొదట దొంగతనం ఉద్దేశ్యంతో ఇంట్లోకి ప్రవేశించిన ఆ బాలుడు.. సహస్ర అడ్డుపడడంతో రాక్షసరూపం ధరించాడు. ఇంట్లో నుంచి ఆ డబ్బులను తీసుకెళ్తుండగా ఆమె అడ్డుపడటంతో సహస్రపై కూర్చుని గొంతునులిమి చంపే ప్రయత్నం చేశాడు.


అయినా ఆమె ఇంకా బతికే ఉందేమోనన్న అనుమానంతో కత్తితో పలు సార్లు పొడిచి అక్కడికక్కడే హతమార్చాడు. బాలిక హత్య సమయంలో కేకలు వేసినట్లుగా చుట్టుపక్కల నివసిస్తున్న వారు పోలీసులకు తెలియజేశారు. హత్య చేసిన తర్వాత అతడు పక్క బిల్డింగ్‌లోకి వెళ్లి 15 నిమిషాల పాటు ఎవరికీ దొరక్కుండా దాక్కున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. . పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బాలిక శరీరంపై 20 కత్తి గాయాలు ఉండగా.. మెడపై 10 గాయాలు ఉన్నట్లు తెలిసింది.


పోలీసుల వివరాల ప్రకారం.. నేరానికి ముందు ఆ బాలుడు ఒక పేపర్‌పై ‘ఎవరైనా అడ్డొస్తే ఎలా ఎదుర్కోవాలి’ అనే ప్రణాళిక రాసుకున్నాడట. దానినే అమలు చేస్తూ నరమేధానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దాదాపు 80 వేల రూపాయలు దోచుకుని పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ లోగా ఆ బాలిక చూడటంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే విచారణలో అతని సమాధానాలు పొంతనలేకపోవడంతో చివరికి నేరం బయటపడింది. ప్రస్తుతం ఆ బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa