కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు విషాదం ఇంకా మనసుల్లో నుంచి ఇంకా బయటకు పోలేదు. ఆ బాధను మర్చిపోక ముందే.. మరో దారుణం జరిగింది. భద్రాచలం ఏజెన్సీలో జరిగిన ఈ ఘటన మానవత్వాన్ని మళ్ళీ ప్రశ్నిస్తోంది. 17 ఏళ్ల ఆదివాసీ బాలికపై జరిగిన ఈ సామూహిక అత్యాచారం ఘటన, సమాజంలో మహిళలకు భద్రత లేదనే చేదు నిజాన్ని మరోసారి రుజువు చేసింది. ఒక అభం శుభం తెలియని బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లాలనే ఆశతో బయలుదేరింది. ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని నరకం చేసింది.
మానవత్వం మరచిన మృగాళ్లు..
శనివారం సాయంత్రం, చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఆ బాలిక చర్ల మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడి నుంచి వాజేడు వెళ్లడానికి ఒక ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్లు మనుషులుగా కాకుండా మృగాలుగా మారారు. ఆమెకు మత్తు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం గురించి తెలిసిన తర్వాత.. స్థానికులు వెంటనే ఆమెను ఒక సంరక్షణ కేంద్రానికి తరలించి మానవత్వం చాటారు. ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు, గాయాలు చూసి పోలీసులు కూడా చలించిపోయారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ రోహిత్ రాజు.. చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ స్టేషన్ల నుంచి పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అత్యాచారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఎన్ని చట్టాలు ఉన్నా, ఎంత కఠిన శిక్షలు విధించినా, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న ప్రజలను వేధిస్తోంది. ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. నిందితులకు కఠిన శిక్ష పడితేనే.. ఇలాంటి నేరాలను కొంతవరకైనా అరికట్టవచ్చని ప్రజలు కోరుకుంటున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళల భద్రతకు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భద్రాచలం ఘటన సమాజంలోని ఇంకా లోపాలను సూచిస్తుంది. మహిళలపై గౌరవం లేకపోవడం, ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు తక్కువగా ఉన్నాయనే భావన ఇలాంటి నేరాలకు దారితీస్తున్నాయనే చెప్పుకోవాలి. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడం, కఠిన చట్టాలను అమలు చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి నేరాలను ఆపవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa