తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. గణపతి విగ్రహాల తరలింపు, మండపాల నిర్మాణం, నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లతో నగరాలు ప్రస్తుతం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న తరుణంలో భద్రతా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మండప నిర్వాహకులకు మార్గదర్శకాలను జారీ చేశారు.
మొదటగా, ప్రతి మండపానికి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్ కనెక్షన్లు కచ్చితంగా సంబంధిత అధికారుల అనుమతితోనే పొందాలి. మండపాల నిర్మాణాన్ని నిపుణులకే అప్పగించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు.
డీజే వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ.. రాత్రి పది గంటల తర్వాత మైక్ వినియోగంపై పరిమితి విధించారు. సౌండ్ సిస్టమ్‌ను ప్రభుత్వ నిబంధనల్లో నిర్ణయించిన డెసిబెల్స్ లోపే వాడాలని ఆదేశించారు. భద్రత దృష్ట్యా మండపాల వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం బలంగా ఉండేలా చూసుకోవాలని, భక్తుల రద్దీకి తగ్గట్టుగా క్యూలైన్లు, వాలంటీర్లు ఉండాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహన పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలు కేటాయించాలని సూచించారు.
నవరాత్రి మండపాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ వైర్లను పిల్లలకు అందకుండా సురక్షితంగా అమర్చడం, వాలంటీర్లకు ఐడీ కార్డులు ఇవ్వడం, రాత్రిపూట కూడా భక్తుల భద్రత కోసం వారు విధుల్లో ఉండడం తప్పనిసరి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. ఉత్సవ నిర్వాహకులు టపాకాయలు లేదా ప్రమాదకర వస్తువులను మండపాల్లో నిల్వ చేయరాదని సూచించారు. ఎమర్జెన్సీ లైట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, జనరేటర్ల ఇంధనాన్ని మండపానికి దూరంగా ఉంచాలని తెలిపారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న మండపాల్లో సౌండ్ సిస్టమ్ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
విగ్రహాల తరలింపులో ట్రాఫిక్ రద్దీ సమయాలను దాటవేయాలని, చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలను తరలించకూడదని, విద్యుత్ వైర్లకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ విగ్రహాల కోసం క్రేన్‌లు వినియోగించాలి, పిల్లలను ఈ తరహా కార్యక్రమాల్లోకి అనవసరంగా తీసుకురాకూడదని హెచ్చరించారు. చివరగా.. విగ్రహ నిమజ్జనం కోసం ప్రభుత్వం కేటాయించిన అధికారిక స్థలాలను మాత్రమే వినియోగించాలని, పోలీసులు సూచించిన మార్గాల్లోనే ర్యాలీలు కొనసాగించాలని ఆదేశించారు.
ఈ మార్గదర్శకాలు ఉత్సవాలు శాంతియుతంగా సాగేందుకు, భక్తులు సురక్షితంగా గణేశుని దర్శించేందుకు.. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు కీలక పాత్ర పోషించనున్నాయి. దీంతో పాటు.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa