హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, రహదారి ఆక్రమణలు, పార్కులు, నీటి వనరులపై దాడులు చాలా కాలంగా ఒక పెద్ద సమస్యగానే ఉన్నాయి. ఈ క్రమంలో హైడ్రా ఏర్పాటు కావడంతో పరిస్థితులు మారాయి. గతంలో పెద్ద నాయకులు, రాజకీయ ప్రోత్సాహం ఉన్నవారు ఆక్రమణలు చేసినా.. సాధారణ ప్రజలు ఏం చేయలేని స్థితి నెలకొనేది. కానీ హైడ్రా ముందుకు రావడంతో ఇప్పుడు ప్రజల్లో ధైర్యం పెరిగింది.
తాజాగా పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు అభినందించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరముందని పేర్కొంది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన వాటిని తొలగించే విషయంలో హైడ్రా అవసరముందంటూ జస్టిస్ విజయశేన్ రెడ్డి వాఖ్యానించారు. రాంనగర్ మనెమ్మ గల్లీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోడ్డు ఆక్రమణపై జీహెచ్‌ఎంసీకి గతంలో ఫిర్యాదు చేసింది.
హైడ్రా సహకారాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది. దీంతో హైడ్రా రంగంలోకి దిగి.. జమినిస్తాన్పూర్, రామ్ నగర్ క్రాస్ రోడ్స్లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని హైడ్రా తొలగించింది. దీంతో రామ్ నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు అవకాశం లభించింది. అయితే ఈ విషయమై.. రోడ్డుపై వాణిజ్య సముదాయాన్ని నిర్మించిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు గురువారం విచారణకు రాగా.. జస్టిస్ విజయశేన్ రెడ్డిపై విధంగా వ్యాఖ్యానించారు.
రహదారులను ఆక్రమించేసి రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించడంలో HYDRAA వంటి సంస్థలు ముఖ్యమైనవని హైకోర్టు పేర్కొంది. ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాలకు లోబడి ప్రైవేట్ ప్రయోజనాలు ఉండాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడడంలో నగరం అంతటా HYDRAA చేస్తున్న కార్యక్రమాలను హైకోర్టు ప్రశంసించింది.
హైదరాబాద్‌లో అనధికారిక భవనాలు పెరగడంతో వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ అవుతోంది. చిన్న చిన్న గల్లీలు మూసుకుపోవడం వల్ల అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు సమయానికి గమ్యానికి చేరడంలో ఆటంకం కలుగుతోంది. అదనంగా.. భూగర్భ జలాలు తగ్గిపోవడం, చెరువులు మాయం కావడం కూడా ఈ అక్రమ కట్టడాల వలన జరుగుతోందని నిపుణులు సూచిస్తున్నారు. రాంనగర్ ఘటనలో హైకోర్టు తీర్పు హైడ్రా చర్యలకు పెద్ద బలాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ కట్టడాలపై హైడ్రా తీసుకునే చర్యలకు ఇది చట్టపరమైన రక్షణగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa