హైదరాబాద్ భవిష్యత్ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. దాదాపు 30 వేల ఎకరాల భూమి అవసరమని హెచ్‌ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల వెల్లడించారు. ఆయన ఢిల్లీలో జరిగిన నరెడ్కో సదస్సులో మాట్లాడుతూ.. నగరాన్ని దీర్ఘకాలికంగా విస్తరించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మాస్టర్ ప్లాన్–2050 రూపకల్పన ప్రస్తుతం జరుగుతోందని.. ఇందులో నగర అభివృద్ధి, పారిశ్రామిక జోన్లు, నివాస అవసరాలు, రవాణా సదుపాయాలు అన్నీ సమగ్రంగా చేర్చుతున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలోనే వెయ్యి ఎకరాల భూసేకరణ అవసరమని.. ఇప్పటికే సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు.
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్..
హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు రీజినల్ రింగ్ రోడ్డు అత్యంత కీలకం కానుంది. ఇది 350 కిలోమీటర్ల పరిధిలో నిర్మించబడి, ఎన్‌హెచ్‌లను అనుసంధానించి, బయటి జిల్లాలకు వేగవంతమైన రాకపోకలు కల్పిస్తుంది. ఈ రోడ్డు పూర్తయితే రాజధాని నగరంపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా, పరిశ్రమల స్థాపన, గోదాములు, లాజిస్టిక్స్ హబ్‌ల అభివృద్ధికి పెద్ద ఊతమిస్తుంది. మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌తో ఈ ప్రాజెక్ట్ సమన్వయం చేయబడుతుందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్‌గా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ వృద్ధి మరింత విస్తరించేందుకు ‘ఫోర్త్ సిటీ’(ఫ్యూచర్ సిటీ) అనే కాన్సెప్ట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫార్మా సిటీ ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇకపై ఫోర్త్ సిటీ రూపకల్పన ద్వారా ఐటీ, బయోటెక్, ఎడ్యుకేషన్, స్టార్ట్-అప్ లాబ్‌లు, గ్రీన్ ఎనర్జీ హబ్‌లను ఒకేచోట కలిపే ప్రణాళిక ఉందని సమాచారం. ఇది పూర్తయితే.. లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడటమే కాకుండా.. హైదరాబాద్‌ను సస్టైనబుల్ స్మార్ట్ సిటీ మోడల్గా నిలబెట్టనుంది.
సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు..
హైదరాబాద్ విస్తరణలో రోడ్లతో పాటు పర్యావరణ పరిరక్షణ, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, మెట్రో కనెక్టివిటీ కూడా మాస్టర్ ప్లాన్‌లో భాగమని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక పార్కులు, ఆవాస సముదాయాలు, పారిశ్రామిక హబ్‌లు, విద్యా సంస్థలు సమన్వయంతో ఏర్పాటు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa