శంకర నేత్రాలయ USA చేపట్టిన 'అడాప్ట్-ఎ-విలేజ్' కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి, NRI దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. NRI దాతల ఆర్థిక సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలలో వేలాది మంది ప్రజలు చికిత్స పొందుతున్నారు. ఈ గొప్ప కార్యక్రమం స్ఫూర్తితో మరిన్ని గ్రామాల్లో ఉచిత మొబైల్ కంటి శస్త్ర చికిత్స విభాగాలు (Mobile Eye Surgical Unit) నిర్వహించేందుకు ఇంకొందరు దాతలు ముందుకు రావడం విశేషం.
ఈ సేవా యజ్ఞానికి మరింత మద్దతు కూడగట్టేందుకు శంకర నేత్రాలయ USA అక్టోబర్ 17న 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలతో ముఖాముఖి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అనేక మంది దాతలు తాము పొందిన సంతృప్తిని, అనుభవాలను పంచుకున్నారు. అమెరికా, సింగపూర్, యూకే వంటి దేశాల నుంచి NRIలు ఈ సేవా కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తమ వంతుగా సాయం అందించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు దృష్టిని ప్రసాదించడంలో తాము భాగస్వాములం కావడం గొప్ప విషయమని తెలిపారు.
ఈ కార్యక్రమం లక్ష్యం – గ్రామీణ ప్రాంతాల్లో కంటి శిబిరాలు నిర్వహించి, వీలైనంత ఎక్కువ మందికి ఉచిత కంటి చికిత్స అందించడం. దాతలు తమ స్వగ్రామాల్లో శిబిరాల నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా వందల మందికి కంటి శస్త్రచికిత్సలు, స్క్రీనింగ్‌లు, అలాగే వారికి అవసరమయ్యే భోజనం, రవాణా సేవలు కూడా ఉచితంగా అందజేయబడుతున్నాయి. అక్టోబర్ 30వ తేదీ వరకు 11 రోజులపాటు 'అడాప్ట్-ఎ-విలేజ్' కార్యక్రమం కొనసాగనుంది, తద్వారా మరిన్ని గ్రామాలకు ఈ సేవలు అందనున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కొండా రెడ్డిపల్లిలో నిర్వహించిన శిబిరంలో తెలంగాణ విద్యా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి ఇందుర్తి, ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, హూస్టన్‌కు చెందిన ప్రముఖ రియల్టర్ రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాతల నుంచి లభిస్తున్న మద్దతుతో పాటు, స్థానిక వైద్యులు, రోటరీ క్లబ్స్, పలువురు నాయకుల సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా ముందుకు సాగుతోందని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి తెలియజేశారు. ఈ సహకారం మరిన్ని గ్రామాలకు వెలుగులు పంచేందుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa