తెలంగాణలో నిరుపేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే ఈ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, అనర్హులను ఏరివేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దృష్టి సారించాయి. దీనిలో భాగంగా, ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖాధికారులు నిబంధనల అమలుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
రేషన్ కార్డులు ఉన్నప్పటికీ కొందరు లబ్ధిదారులు బియ్యాన్ని తీసుకోకపోవడం, లేదా కుటుంబంలో ఎవరైనా చనిపోయినా వారి పేరు మీద కేటాయించిన కోటాను ఇతరులు తీసుకోవడం వంటి అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరణించినా వారి కోటా తగ్గకుండా, ఆ బియ్యాన్ని కుటుంబంలోని మిగిలిన వారు తీసుకుంటుండటంతో ప్రతి నెలా ప్రభుత్వానికి వందల క్వింటాళ్ల బియ్యం అనవసరంగా ఖర్చవుతోంది. ఈ లోపాలను సరిదిద్దడానికి, బోగస్ కార్డులు, అనర్హులను గుర్తించడానికి ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్ వివరాలు (వేలిముద్రలు లేదా కంటిపాప) అప్‌డేట్ చేసి వారు సజీవంగా ఉన్నారని అర్హులని ధ్రువీకరించుకోవడం జరుగుతుంది.
పౌరసరఫరాల శాఖాధికారుల హెచ్చరికల ప్రకారం.. రేషన్ కార్డు పొందిన కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక కుటుంబం నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోయినా లేదా వరుసగా ఆరు నెలల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోకపోయినా.. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిన పక్షంలో.. మొదటి దశలో ఆ లబ్ధిదారుడికి సంబంధించిన కోటాను తర్వాత నెల నుంచి తగ్గించి సరఫరా చేస్తారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే కార్డు నుంచి ఆ లబ్ధిదారుడి పేరును పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ-కేవైసీ నమోదుకు పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ.. చాలా మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ సేవలు నిరంతరాయంగా పొందడానికి లబ్ధిదారులంతా గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa