ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 07:11 PM

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ (Outsourcing) పద్ధతిలో నియమించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని వెల్దండ మండలం గుండాల వద్ద ఉన్న ఏకలవ్య పాఠశాలలో సిబ్బంది నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె. సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.


ప్రస్తుత నియామక ప్రక్రియ ద్వారా పాఠశాలలో మెస్ హెల్పర్స్ , స్టూడెంట్ కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెస్ హెల్పర్స్ పోస్టులకు సాధారణంగా పదో తరగతి లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగి.. వంట చేయడంలో పని అనుభవం ఉన్నవారికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు.


స్టూడెంట్ కౌన్సిలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 01 తేదీ నుంచి నవంబర్ 08 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలతో పాటు.. అన్ని అర్హత ధ్రువీకరణ పత్రాలను సాయంత్రం 04:00 గంటల లోపు పాఠశాల కార్యాలయంలో నేరుగా సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ మార్కుల ఆధారంగా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


ఈ నోటిఫికేషన్‌లోని పోస్టుల సంఖ్యను పెంచడం, తగ్గించడం లేదా ప్రకటనను రద్దు చేయడం వంటి అధికారం ప్రాజెక్ట్ ఆఫీసర్ , మన్ననూర్, నాగర్ కర్నూల్‌కు మాత్రమే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఏకలవ్య మోడల్ పాఠశాలలు గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఈ నియామకాల ద్వారా పాఠశాలలో సిబ్బంది కొరతను తగ్గించి.. మెరుగైన సౌకర్యాలు అందించడానికి కృషి జరుగుతుంది. మరింత సమాచారం కోసం 9704244232 మరియు 08549274100 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa