తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి విస్తరణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడంతో.. హైదరాబాద్ పరిపాలనా స్వరూపంలో పెను మార్పులు రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలోని 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ ఇప్పుడు మెగా సిటీగా అవతరించనుంది.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు ఉండగా.. విలీనం తర్వాత ఇది దాదాపు మూడింతలు పెరిగి సుమారు 2,000 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ జనాభా 67.31 లక్షలు కాగా.. ప్రస్తుతం కోటి 40 లక్షలకు చేరినట్టు అంచనా. ఈ 27 స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ జనాభా కోటి 70 లక్షలకు చేరుతుందని మున్సిపల్ అధికారులు అంచనా వేశారు.
కొత్తగా ఇబ్రహీంపట్నం, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాలు జత కలవనున్నాయి. అలాగే.. లోక్‌సభ స్థానాల జాబితాలో భువనగిరి కూడా చేరే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 150 డివిజన్ల సంఖ్య విలీనం తర్వాత 250-300కు పెరిగే అవకాశం ఉంది.
ఎవరికి లాభం, ఎవరికి నష్టం..?
మున్సిపాలిటీల విలీనంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతాలకు జీహెచ్ఎంసీ తరహాలో మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి మౌలిక వసతులు అందుతాయి. చిన్న మున్సిపాలిటీలు సొంతంగా భరించలేని భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. అభివృద్ధిలో వెనుకబడిన జవహర్‌నగర్, జల్‌పల్లి, తుక్కుగూడ వంటి మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ నిధులు లభించి.. త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పాలనా సౌలభ్యం కోసం మొత్తం ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి.. ఎక్కడికక్కడ కమిషనర్లు, కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే నిపుణుల సూచనలు అమలైతే.. పాలన మరింత సమర్థవంతంగా మారుతుంది.
విలీనం కారణంగా మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలపై ఆస్తి పన్ను శ్లాబులు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే.. ప్రభుత్వం పన్ను శ్లాబులు పెంచే ఆలోచన లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మణికొండ, నార్సింగి వంటి ఆదాయ వనరులు అధికంగా ఉన్న మున్సిపాలిటీల ప్రజలు.. తమ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని వేరే అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఖర్చు చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. విలీన ప్రాంతాల్లోని వందలాది గ్రామాలను నగర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే క్రమంలో.. ఆ గ్రామీణ వాతావరణం, సంస్కృతి దెబ్బతినే ప్రమాదం ఉంది.
జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ కారణంగా భూముల రేట్లు పెరిగే అవకాశం కచ్చితంగా ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే.. జీహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల ఆ ప్రాంతాలకు నగరపాలక సంస్థ హోదా లభిస్తుంది.. ఇది స్థిరాస్తి విలువను పెంచుతుంది. జీహెచ్ఎంసీ నిధులు, అభివృద్ధి ప్రణాళికలు అమలులోకి రావడం వల్ల మౌలిక వసతులు మెరుగుపడి, నివాసయోగ్యత పెరుగుతుంది.
మెరుగైన మౌలిక వసతులు, పాలనా వ్యవస్థ కారణంగా ప్రజలు ఆ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతారు.. తద్వారా స్థానిక భూముల డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి. విలీనం తర్వాత డివిజన్ల పునర్విభజన, పాలనా సౌలభ్యం కోసం ఆరు జోన్ల ఏర్పాటు వంటి సవాళ్లను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే.. ఈ బృహత్‌నగరం పాలనా గాడిలో పడి, స్థిరమైన అభివృద్ధిని సాధించగలదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa