ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మల్ జిల్లాలో మాతృ మరణాలకు అడ్డుకట్ట వేసిన పథకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 07:33 PM

నిర్మల్ జిల్లాలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, రక్షణ కోసం ప్రవేశపెట్టిన అమ్మ రక్షిత పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 2024 డిసెంబర్ 14న ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ఆధునిక సాంకేతికత, వైద్య నిపుణుల పర్యవేక్షణతో తల్లీబిడ్డల మరణాలను గణనీయంగా తగ్గించగలిగింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో.. 2030 నాటికి నిర్మల్ జిల్లాను మాతృ మరణాలు లేని జిల్లాగా  తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.


గణాంకాలు ఏం చెబుతున్నాయి?


గత కొన్నేళ్లలో మాతృ మరణాల రేటును గమనిస్తే ఈ పథకం ప్రాముఖ్యత అర్థమవుతుంది. 2020-21లో.. 11,060 ప్రసవాలలో 12 మంది తల్లులు మరణించారు. 2021-22లో.. మరణాల సంఖ్య 18కి పెరిగింది.


2023-24లో.. పకడ్బందీ చర్యల వల్ల మరణాల సంఖ్య 4కి తగ్గింది. 2024-25 (తొలి 9 నెలలు)లో కేవలం 3 మరణాలు మాత్రమే సంభవించాయి. 2024 డిసెంబర్ నుండి 2025 అక్టోబర్ మధ్య కాలంలో 1,173 సాధారణ ప్రసవాలు జరగగా.. 3,113 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి.


నిర్మల్ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం  , బైంసా ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆరుగురు సూపర్‌వైజర్లు ప్రతిరోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను  సందర్శించి గర్భిణీలకు రక్తహీనత పరీక్షలు చేయిస్తారు. గర్భం దాల్చిన 20వ వారంలో తప్పనిసరిగా టిఫా స్కాన్ జరిగేలా చూస్తారు. క్షేత్రస్థాయి సిబ్బందికి, పెద్దాసుపత్రులకు మధ్య వీరు ఒక వారధిలా పనిచేస్తారు.


గర్భిణీలకు కేవలం సాధారణ పరీక్షలే కాకుండా.. గుండె సంబంధిత సమస్యలను గుర్తించడానికి 2డి ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా వారానికోసారి గైనకాలజిస్టులతో ఆన్‌లైన్ సంప్రదింపులు జరిపిస్తున్నారు. ప్రసవానంతర వచ్చే ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల పరిష్కారానికి మానసిక ఆరోగ్య సేవలను కూడా అందిస్తున్నారు.


రక్తహీనతను తగ్గించేందుకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు.. క్యాల్షియం సప్లిమెంట్లను ఉచితంగా అందజేస్తున్నారు. గర్భిణీలను వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి మూడు రకాలుగా విభజిస్తారు. అందులో రెడ్ అత్యంత ప్రమాదకర స్థితి, పింక్ .. మధ్యస్థ ప్రమాదం, గ్రీన్ .. క్షేమంగా ఉన్నవారు. ఆయుష్ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రీనేటల్ యోగా, స్థానిక పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు.


అమ్మ రక్షిత పథకం ఎందరో తల్లుల ప్రాణాలను కాపాడింది. ఉదాహరణకు.. తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక గర్భిణీకి తక్షణమే రక్తమార్పిడి , గుండె చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. అలాగే.. గర్భాశయం చిట్లిపోయిన స్థితిలో వచ్చిన మరో మహిళకు అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యకరమైన బాబును ప్రసవించేలా చేశారు. ఇవన్నీ ఈ పథకం ద్వారా సమకూరిన నిపుణుల పర్యవేక్షణ వల్లే సాధ్యమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa