ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ నన్ను జైలుకు పంపించి నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడని వ్యాఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 10:00 PM

కొడంగల్ బిడ్డగా ఇదే గడ్డ మీది నుంచి ఒక మాట చెబుతున్నానని, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని, ఇదే తన శపథమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి రానివ్వనని, ఇదే తన సవాల్ అన్నారు.ఇక బీఆర్ఎస్ గతమేనని, భవిష్యత్తు కాంగ్రెస్ మాత్రమే అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80కి పైగా సీట్లు సాధిస్తుందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 అయితే 100కు పైగా స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాసిపెట్టుకోండి. రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకువస్తాం. ఇదే నా సవాల్" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి విమర్శించారు.కేసీఆర్ తనను జైలుకు పంపించాడని, తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తనపై విమర్శలు చేస్తూ తోలు తీస్తానని హెచ్చరించారని, కానీ మా సర్పంచ్‌లు చింతమడకలో మిమ్మల్ని చీరి చింతాకు కడతారని హెచ్చరించారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ సాధించిన అని చెప్పుకునే వ్యక్తిగా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అని నిలదీశారు.మేం మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడుతామని, కానీ మర్యాద ఉండదని ఊరుకుంటున్నామని అన్నారు. మేం మాట్లాడటం మొదలు పెడితే మల్లన్న సాగర్‌లో దూకి చస్తావని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును ఎండగట్టారని, ప్రాజెక్టులు ఏవీ పూర్తి చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యారని అన్నారు. పగ సాధించడం మొదలు పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలి పెట్టానని అన్నారు. నేను ప్రమాణం చేసినప్పుడే ఆయన కూలబడ్డారని, ఇంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫాంహౌస్‌ను బందీఖానాగా మార్చుకున్నారని, చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు పంపినా అదే పరిస్థితి ఉంటుందని అన్నారు.తాను నల్లమల నుంచి వచ్చి జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ అంశంపై అయినా చర్చించడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ వయస్సును గౌరవిస్తామని, ఈ నెల 29 నుంచి జరగబోయే సమావేశాలకు కేసీఆర్ వచ్చి సూచనలు చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa