ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు.. ప్రస్తుత మదింపు సంవత్సరానికి లేదా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయంపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డెడ్‌లైన్ 2025, సెప్టెంబర్ 16తోనే ముగిసింది. అయితే వాస్తవంగా చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తే వారికి ఐటీ శాఖ నుంచి రిఫండ్ వస్తుంది. అయితే చాలా మంది ఐటీఆర్ దాఖలు చేసి చాలా కాలమైనా.. ఇప్పటికీ రిఫండ్ అకౌంట్లో జమ కాలేదు. ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కొంత మంది టాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నుంచి సందేశాలు వస్తున్నాయి. టాక్స్ రిఫండ్లను హోల్డ్‌లో పెడుతున్నట్లు ఆదాయపు పన్ను విభాగం నుంచి మెయిల్స్ లేదా SMS లు వస్తున్నాయి.
>> సదరు పన్ను చెల్లింపుదారులు.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు టాక్స్ రిఫండ్ ఎందుకు నిలిపివేశారో తెలియక సతమతమవుతున్నారు. దీనిపై ఇప్పుడు ఐటీ శాఖ స్పందించింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు.. పొరపాట్లు జరుగుతుంటాయని.. స్వచ్ఛందంగానే పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను సమీక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ అలర్ట్స్ పంపిస్తున్నట్లు స్పష్టం చేసింది.
>> ఆదాయపు పన్ను శాఖ విభాగం.. ఇటీవల టాక్స్‌పేయర్లకు పెద్ద ఎత్తున సందేశాల రూపంలో నోటీసుల్ని పంపించింది. రిఫండ్ క్లెయిమ్స్‌లో వ్యత్యాసాల కారణంగా.. ఐటీ రిఫండ్స్ హోల్డ్ చేశారనేది దాని అర్థం. డిసెంబర్ 31 లోపు వీటిని సవరించుకునేందుకు రివైజ్డ్ రిటర్న్స్ సమర్పించాలని దాంట్లో పేర్కొన్నట్లు పలువురు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐటీఆర్ హోల్డ్‌లో పెట్టినట్లు.. పూర్తి వివరాలు ఇ- మెయిల్‌లో ఉన్నట్లు తమకు సందేశం వచ్చిందని చాలా మంది కంప్లైంట్ చేశారు. పోర్టల్‌లో మాత్రం ఐటీ రిఫండ్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిందని ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ఇలా చాలా మంది గందరగోళానికి గురవుతున్న క్రమంలో.. ఐటీ శాఖ స్వయంగా స్పందించింది.
నడ్జ్ క్యాంపెయిన్‌లో భాగంగానే.. ఈ సందేశాల్ని పంపుతున్నట్లు పేర్కొంది. కొందరు టాక్స్ పేయర్లు.. ఐటీ రిఫండ్ కోసం తప్పుడు మార్గాల్ని అవలంబిస్తున్నారని.. బోగస్ క్లెయిమ్స్ చేస్తున్నారని.. అర్హత లేకపోయినా తప్పుడు మినహాయింపుల్ని చూపించి రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకుంటున్నారని గుర్తించింది. ఇందుకోసం ఐటీ శాఖ డేటా అనలిటిక్స్ అత్యాధునిక సాంకేతికతల్ని ఉపయోగిస్తుంది. దీంతో ఐటీఆర్‌లో పేర్కొన్న మినహాయింపుల్ని స్వచ్ఛందంగా సరిచూసుకోవాలన్న ఉద్దేశంతోనే సందేశాల్ని పంపించినట్లు వివరణ ఇచ్చింది. తప్పులు ఉన్న వారు.. డిసెంబర్ 31 లోపు సవరించిన వివరాలతో రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయాలని తెలిపింది. మినహాయింపులకు సంబంధించి క్లెయిమ్స్ సరిగానే ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 21 లక్షల మందికిపైగా అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసి రూ. 2500 కోట్ల మేర పన్ను చెల్లించినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa