ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గం చెరువు ఆక్రమ‌ణ‌లకు హైడ్రా చెక్‌,,,5 ఎక‌రాల మేర క‌బ్జాల‌ను తొల‌గించిన హైడ్రా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 09:18 PM

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని మాధాపూర్ పరిసరాల్లో ఎంతో అందంగా కొండల మధ్య ఉండే దుర్గం చెరువును ఆక్రమణదారుల చెర నుంచి విడిపించేందుకు హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇనార్బిట్ మాల్ వైపు ఉన్న చెరువు భూముల్లో సుమారు 5 ఎకరాల మేర జరిగిన కబ్జాలను మంగళవారం అధికారులు తొలగించారు. ఈ భూమిని మట్టితో నింపి.. వాహనాల పార్కింగ్ స్థలంగా మార్చి నెలకు దాదాపు 50 లక్షల రూపాయల వరకు అద్దెలు వసూలు చేస్తున్న అక్రమ దందాకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెక్ పెట్టారు.


క్రమంగా కుంచించుకుపోయిన చెరువు చారిత్రక ఆధారాల ప్రకారం గోల్కొండ కోటలో నివసించే రాజవంశీయులకు ఈ దుర్గం చెరువు నుంచే తాగునీరు సరఫరా అయ్యేది. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంలో కళకళలాడిన ఈ చెరువు.. ప్రస్తుతం కేవలం 116 ఎకరాలకే పరిమితమైంది. ఎన్ఆర్ఎస్సీ అందించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. 1976 నుండి ఇప్పటివరకు వివిధ దశల్లో ఈ చెరువు ఆక్రమణకు గురైంది. 1976 నాటికే 29 ఎకరాలు కబ్జా అవ్వగా.. 1995 తర్వాత మరో 10 ఎకరాలు, గత కొన్నేళ్లలో మరో 5 ఎకరాలు కబ్జాదారుల పాలైంది. ప్రస్తుతం కేవలం ఒక దిశలో తప్ప మిగిలిన మూడు వైపులా అక్రమ నిర్మాణాలు వెలిశాయి.


పార్కింగ్ దందా, ఆక్రమణల తీరు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిని ఏకంగా 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పోసి చెరువును పూడ్చివేశారు. ఇలా ఆక్రమించిన స్థలాన్ని ఒక ప్రజాప్రతినిధి తనదిగా చెప్పుకుంటూ.. అక్కడ స్కూల్ బస్సులు, ఐటీ కంపెనీల వాహనాల పార్కింగ్ కోసం అద్దెకు ఇచ్చారు. ఎటువంటి భూ రికార్డులు లేకుండానే ఏటా చెరువు భూమిని ఆక్రమిస్తూ తన సొంత భూమి విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ ఆక్రమణల వల్ల చెరువు చుట్టూ నిర్మించాల్సిన వాకింగ్ ట్రాక్ పనులు కూడా నిలిచిపోయాయి.


హైడ్రా అధికారులు ప్రస్తుతానికి అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను ఖాళీ చేయించి.. ఆ స్థలానికి ఫెన్సింగ్ వేశారు. త్వరలోనే చెరువులో నింపిన మట్టిని పూర్తిగా తొలగించి.. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. హెచ్‌ఎండీఏ, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డులను పరిశీలించి చెరువు అసలు సరిహద్దులను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడటమే తమ ప్రాధాన్యతని.. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హైడ్రా హెచ్చరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa