ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్న 'హైడ్రా'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 12:07 PM

హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాటి నివారణకు 'హైడ్రా' కఠిన చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని వాణిజ్య భవనాలు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలుపై నేటి నుంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనాలకు తాళాలు వేయడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదమే ఈ కఠిన నిర్ణయాలకు కారణమైంది. పార్కింగ్ కోసం ఉద్దేశించిన సెల్లార్‌ను గోదాముగా మార్చి, మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేయడంతోనే ప్రాణ నష్టం తీవ్రత పెరిగిందని సమీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని వాణిజ్య సంస్థలు తమ సెల్లార్లను వెంటనే ఖాళీ చేసి, కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో సెల్లార్లను గోదాములుగా వాడుతున్నట్లు తేలితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.బుద్ధభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని భవనాల ముందు 'ప్రమాదకరం' అని బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటికి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. మెట్లు, కారిడార్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఖాళీగా ఉంచాలని, ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేసే స్థితిలో ఉండాలని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa