మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు పుట్టించింది. ఈ పరిణామంతో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ అధినేతను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్లపైకి చేరారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి.
బీఆర్ఎస్ నిరసన సెగ తగలకుండా పోలీసులు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ లక్ష్యంగా నిరసనలు జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో అక్కడ భారీగా బలగాలను మోహరించారు. కార్యాలయం వైపు వెళ్లే దారులన్నింటినీ బారికేడ్లతో మూసివేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇనుప గడియలాంటి భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిరసనకారులు బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఉద్రిక్తత పెరగడంతో పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం నల్గొండలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సిట్ విచారణ పేరుతో వేధింపులకు దిగితే సహించేది లేదని గులాబీ దళం హెచ్చరిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా పోలీసులు గస్తీని పెంచి, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa