మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ శక్తి ప్రదర్శన నిర్వహించాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం చేపట్టిన రోడ్ షోకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పోటెత్తారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి వైరా రింగ్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీ పొడవునా అడుగు తీయలేనంతగా జనం తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కాంగ్రెస్ జెండాలతో రెడ్ అండ్ వైట్ రంగులోకి మారిపోయింది.
రోడ్ షో పొడవునా భట్టి విక్రమార్కకు స్థానిక ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలకగా, యువత ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని భట్టి విక్రమార్క ఓటర్లను కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం సాగుతోందని, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే హస్తం గుర్తుకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల గెలుపు కోసం అంతా సమన్వయంతో పనిచేసి వైరా గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పర్యటనతో వైరా కాంగ్రెస్ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ భారీ ప్రదర్శన ప్రత్యర్థి పార్టీల్లో వణుకు పుట్టించేలా ఉందని, ఎన్నికల ఫలితాల్లో తమదే పైచేయి అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భట్టి విక్రమార్క రాకతో నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది, ఇది కచ్చితంగా ఓటింగ్ సరళిపై సానుకూల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa