తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భద్రత కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (టీజీఎస్పీఎఫ్) సిబ్బందికి కూడా పోలీస్ శాలరీ ప్యాకేజీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం టీజీఎస్పీఎఫ్ సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన పోలీస్ శాలరీ ప్యాకేజీ అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో టీజీఎస్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం రోజున సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ బుద్ధ భవన్‌లో టీజీఎస్పీఎఫ్, ఎస్బీఐ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం టీజీఎస్పీఎఫ్ సిబ్బందికి పోలీస్ శాలరీ ప్యాకేజీ అమలు చేస్తారు.
ఒప్పందం ప్రకారం టీజీఎస్పీఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తూ అనుకోకుండా ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబసభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా కింద కోటి రూపాయలు అందిస్తారు. ఒకవేళ విమాన ప్రమాదాలలో మరణం సంభవిస్తే కోటీ 60 లక్షలు అందిస్తారు. శాశ్వత వైకల్యం సంభవించిన పక్షంలో రూ.80 లక్షల వరకూ పరిహారంగా అందిస్తారు. టీజీఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ చనిపోతే.. వారి పిల్లల ఉన్నత విద్య కోసం 28 లక్షల రూపాయల వరకూ ఆర్థిక సాయం అందిస్తారు. అయితే18-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇద్దరు కుమార్తెల వరకూ పెళ్లి కోసం పది లక్షల వరకూ అందిస్తారు. ఒకరికి అయితే ఐదు లక్షలు.. ఇద్దరు ఉంటే రూ.10 లక్షల వరకూ అందిస్తారు.
అలాగే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ.10 లక్షలు సౌకర్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదనపు ప్రయోజనాల కింద కాలిన గాయాల కేసుల్లో ప్లాస్టిక్ సర్జరీ కోసం గరిష్టంగా రూ.10 లక్షలు, విదేశీ మందుల రవాణా ఖర్చుల కోసం 5 లక్షల వరకూ చెల్లిస్తారు. అలాగే అంబులెన్స్ ఖర్చుల కింద గరిష్టంగా 50 వేలు అందిస్తారు.
ఎయిర్ అంబులెన్సు ఖర్చుల కింద 10 లక్షల వరకూ చెల్లిస్తారు. ప్రమాదం తర్వాత కోమాలో 48 గంటల కంటే ఎక్కువ ఉండి చనిపోతే.. ఐదు లక్షల వరకూ పరిహారం అందుతుందని అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అదనంగా రుణ సౌకర్యాలు, లాకర్ అద్దెపై రాయితీలు, ఖాతాదారులకు ప్లాటినం రూపే డెబిట్ కార్డు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa