పటాన్చెరు : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న నాలుగు లేబర్ కోడ్ లు కార్మిక రంగానికి ఉరితాళ్లుగా మారబోతున్నాయని.. వీటిని వెంటనే ఉపసంహరించుకోకపోతే కార్మిక వర్గాల నుండి నిరంతర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న నూతన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం బి ఆర్ టి యు ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని ఐలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న కార్మిక లోకాన్ని అణిచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ.. పరిశ్రమలలో యూనియన్లు లేకుండా చేసి.. పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలంగా నూతన లేబర్ కోడ్లు రూపొందించిందని దుయ్యబట్టారు. వీటిని అమలు చేసేందుకు 2025 డిసెంబర్ శీతాకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కార్మికుల సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు, కార్మిక నాయకులు నర్రా బిక్షపతి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, పృథ్వీరాజ్, చంద్రశేఖర్, ఆయా పరిశ్రమల కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa