ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరిందని వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 07:02 AM

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనకు రాష్ట్రంలో ఎవరూ పోటీ లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, ప్రతిపక్షాల్లో కూడా తనకు పోటీ ఇచ్చే నాయకుడు లేడని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో తాము పూర్తిగా ఆధారాల ప్రకారమే ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామని సవాల్ విసిరారు. ఇటీవలే ఈ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను విచారించిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.బీఆర్ఎస్ నేతల విమర్శలపై స్పందిస్తూ, తనను విమర్శించిన వారికే తాను సమాధానం ఇస్తున్నానని, ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధించడం లేదని అన్నారు. "కేసీఆర్‌ను జైల్లో పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టేవాడిని. కానీ, ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితమై స్వీయ శిక్ష విధించుకున్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో వేయాల్సిన అవసరం నాకు లేదు" అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నప్పటికీ కేటీఆర్‌ను ఈడీ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు.సింగరేణి బొగ్గు గనుల కేటాయింపు వివాదంపై రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి వివరాలతో చర్చిస్తామని సీఎం తెలిపారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఈ వ్యవహారంలో వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని అన్నారు.2029లో దేశవ్యాప్తంగా 'జమిలి' ఎన్నికలు జరుగుతాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, జూబ్లీహిల్స్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడని, ఆయనకు సరిహద్దులు లేవని కొనియాడారు. ఈ ప్రకటనను రాజకీయ వర్గాలు వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషిస్తున్నాయి. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa