మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు అన్నదాతలకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధులను ఈ నెల 17వ తేదీన విడుదల చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగు పెట్టుబడి సాయం అందించి రైతన్నల్లో భరోసా నింపడం ద్వారా పాలనపై మరింత పట్టు సాధించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయిలో నిధులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.9,000 కోట్లను రైతు భరోసా కోసం ప్రభుత్వం ఇప్పటికే సమీకరించిందని సమాచారం. గత కొంతకాలంగా ఆర్థిక వనరుల సర్దుబాటుపై దృష్టి సారించిన యంత్రాంగం, ఇప్పుడు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యే ప్రక్రియకు మార్గం సుగమమైంది.
మరోవైపు, రైతు భరోసా నిధుల విడుదల అనంతరం రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నగారా మోగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రైతుల మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చని పార్టీ భావిస్తోంది. అందుకే ఈ పథకం అమలును అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని, సకాలంలో నిధులు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.
నేడు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించనున్న కీలక సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలో రైతు భరోసా విధివిధానాలు, నిధుల పంపిణీ షెడ్యూల్‌తో పాటు పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై కూడా సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa