ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాల్టీ,,,కల్వకుంట్ల కవితకు షాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 07:50 PM

జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఆ మున్సిపాల్టీలో గెలిచిన స్వతంత్రులు కాంగ్రెస్‌కు జైకొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డేపల్లిలో మొత్తం 10 వార్డులు ఉండగా.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) 8 స్థానాల్లో గెలుపొందగా.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ చేరో ఒక వార్డును గెలుచుకున్నాయి. ఈ మున్సిపాల్టీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుదారులు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కానీ, వీళ్లంతా అధికార కాంగ్రెస్ పార్టీకి జైకొట్టడంతో మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగురనుంది. ఒక్క వార్డు గెలిచిన కాంగ్రెస్‌కు స్వతంత్రులంతా మద్దతు ఇవ్వడంతో ఛైర్మన్ పదవి దక్కనుంది.


ముఖ్యమంత్రి కార్యాలయానికి వడ్డేపల్లి శ్రీనివాస్‌తో సహా 8 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌ కర్నూలు ఎంపీ మల్లు రవి, నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ కుమార్తె కవిత.. త్వరలోనే రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు . కానీ, ఈలోపు మున్సిపల్ ఎన్నికలు కావడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో ఆమె చేతులు కలిపింది. తన మద్దతుదారులు 'సింహం' గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేసేలా ఆ పార్టీ అధ్యక్షుడితో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వారు సింహం గుర్తుపై పోటీచేసి గెలిచి.. చివరకు కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ 70కిపైగా మున్సిపాల్టీలను.. నాలుగు కార్పొరేషన్లను దక్కించుకుంది. అయితే, 20కిపైగా మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడటంతో గెలిచిన పలువురు స్వతంత్రులు తమకు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa