ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమి భయంతో పంచినవి వెనక్కి తీసుకున్నారు....కట్ చేస్తే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 09:10 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వీటికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన బయటకు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. ఓ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేశాడో వ్యక్తి. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రజలకు తాయిలాలు కూడా పంచిపెట్టారు. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతి ఇంటికీ కుక్కర్లు పంపిణీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యాయి.


అయితే ఫలితాలు రాకముందే అభ్యర్థి మదిలో ఆందోళన. ఓటింగ్ జరిగిన తీరు ఆందోళనకు కారణమైందో.. మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఓడిపోతాననే భయం మొదలైనట్లు సమాచారం. దీంతో ఓటర్లకు పంచిపెట్టిన కుక్కర్లను వెనక్కి ఇచ్చేయాలని పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రమే అతని మద్దతుదారులు పట్టిబట్టినట్లు సమాచారం.


కొంతమంది వ్యక్తులు పోలింగ్ జరిగిన రోజు రాత్రే ఓటర్ల వద్దకు వెళ్లి.. మీరు మాకు ఓటేయలేదని, మీకు ఇచ్చిన కుక్కర్లు, కానుకలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో అవాక్కైన ఓటర్లు.. అభ్యర్థి ఇచ్చిన కానుకలను, కుక్కర్లను రోడ్డుపై వేశారు. మేము అడగకుండానే ఇచ్చారని.. ఇప్పుడిలా తిరిగి అడుగుతున్నారంటూ వారికి ఇచ్చిన కుక్కర్లపై పేర్లు రాసి రోడ్డుపై వేశారు. అయితే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. ఎన్నికల ఫలితాలు అభ్యర్థిని కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎన్నికల్లో సదరు అభ్యర్థి విజయం సాధించారు. అయితే అభ్యర్థి మాత్రం.. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని అంటున్నారు. తనపై కుట్రతోనే తప్పుడు ప్రచారం చేశారని చెప్తున్నారు.


మరోవైపు మంచిర్యాలలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించటం కోసం ఓటుకో రేటు పెట్టి.. ఎన్నికలకు ముందు పంపిణీ చేసినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో ఓడిపోవటంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఓటేశావా లేదా అంటూ ఒట్టు వేయించుకుని, ఓడిపోయినందుకు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నారని స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa