ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లు కాంగ్రెస్‍లోకి, కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 06:55 PM

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడగా.. అత్యధిక స్థానాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వశం అయ్యాయి. కానీ కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ రావడంతో.. జోరుగా క్యాంప్ రాజకీయాలు సాగుతున్నాయి. ఇక సోమవారమే గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతోపాటు.. మేయర్, డిప్యూటీ మేయర్.. ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక జరగనుండటంతో ఈ హంగ్ వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎలాంటి తీర్పు రానుంది.. మేయర్, ఛైర్‌పర్సన్ పీఠాలను ఎవరు కైవసం చేసుకుంటారు అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూపు కరీంనగర్‌ కార్పొరేషన్‌పై పడింది.


కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ.. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు పార్టీలకు సరైన మెజార్టీ రాకపోవడంతో.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ అత్యధికంగా 30 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాల్లో గెలిచాయి. మెజార్టీ మార్కు 34 కాగా.. బీజేపీ స్వతంత్రులను తమవైపు తిప్పుకుంది. దీంతో ఇండిపెండెంట్ల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమాగా ఉన్న కాషాయ పార్టీకి షాక్ తగిలింది.


అయితే ఇదే ఇప్పుడు మరో ట్విస్ట్‌కు దారి తీసింది. బీజేపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి దూకడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట్ రిసార్ట్‌లో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. రిసార్ట్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లతోపాటు కొందరు ఇండిపెండెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారితో ఇప్పటికే మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావులు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రిసార్ట్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.


ఇక ఇటీవల ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చిన నలుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లలో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాంపులోనే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరితోపాటు కరీంనగర్ 15వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచిన సాయిజ్యోతి.. కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో ఇటీవలె కాషాయ కండువా కప్పుకుని బీజేపీలోకి చేరారు. ఆ తర్వాత ఒక వీడియో విడుదల చేసిన సాయిజ్యోతి.. సోమవారం జరగనున్న మేయర్ ఎన్నికలో తనకు ఇష్టం ఉన్న వారికి ఓటు వేస్తానని చెప్పడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.


దీంతో సాయిజ్యోతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు.. ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. అయితే తన పిల్లలకు ఆరోగ్యం బాగోలేదని.. తాను వేరే ఊరికి వెళ్లినట్లు తెలిపిన సాయిజ్యోతి.. తన ఇంటి వద్ద ఆందోళన చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని హెచ్చరిస్తూ మరొక వీడియో రిలీజ్ చేశారు. ఇక స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లతోపాటు.. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో నంబర్ గేమ్‌ మార్చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.


ఈ క్రమంలోనే కరీంనగర్ మేయర్ సీటు రేసులో తమ పార్టీ కూడా ఉందని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం తీవ్ర సంచలనం రేపుతోంది. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదని.. ఎలా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ప్రశ్నించారు. రేపు జరిగే మేయర్ ఎన్నిక సమయానికి ఏదైనా జరగొచ్చని పేర్కొనడంతో అసలు ఏం జరుగుతోంది అనే తీవ్ర ఆసక్తిని రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa