తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇటీవల పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి .. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం పెను సంచలనం సృష్టించడంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా ఇస్నాపూర్ పురపాలక సంఘం ఛైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా మోటే సుమలత.. వైస్ ఛైర్మన్‌గా పట్లోళ్ల మాధవి ఎన్నిక అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న గూడెం మహిపాల్ రెడ్డి.. ఓటు వేసిన తర్వాత ఓటింగ్ ఎలా జరిగిందని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించగా.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేతను ఉద్దేశించి పరోక్షంగా స్పందించిన గూడెం మహిపాల్ రెడ్డి.. బుల్లెట్ దిగిందా, లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ లో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 10 వార్డులు, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. వారిలో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా మరొకరు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 13 ఓట్లు చేరాయి. దీంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ తమదే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa