ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో అత్యాధునిక ఏఐ పరికరాలు చోరీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 03:56 PM

దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో అనూహ్య ఘటన వెలుగుచూసింది. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు హాజరైన ఈ వేదికపై, ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన అత్యాధునిక ఏఐ పరికరాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. వివరాల్లోకి వెళ్ళితే... బెంగళూరుకు చెందిన ‘నియోసాపియన్’ అనే ఏఐ స్టార్టప్ ప్రతినిధులు ఈ సదస్సులో తమ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగ్జిబిషన్ ఏరియాను సందర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకే స్టాల్స్ ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భద్రతా సిబ్బంది ఆదేశించారు.తన కంపెనీ రూపొందించిన 'ఏఐ వేరబుల్' పరికరాలను వెంట తీసుకెళతానని కంపెనీ సీఈఓ ధనంజయ్ యాదవ్ కోరగా, అక్కడ భద్రతకు ఏ డోకా ఉండదని సిబ్బంది భరోసా ఇచ్చారు. అందరూ ల్యాప్‌టాప్‌లు కూడా అక్కడే వదిలి వెళుతున్నారని చెప్పారు. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ధనంజయ్ తన స్టాల్‌కు వచ్చి చూడగా, పరికరాలు ఉన్న పెట్టెలు ఖాళీగా కనిపించాయి. అత్యంత విలువైన ఏఐ పరికరాలు మాయమవడంతో ఆయన విస్మయానికి గురయ్యారు.ఈ చేదు అనుభవాన్ని ధనంజయ్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘హై-సెక్యూరిటీ జోన్ కావడంతో ఆ సమయంలో కేవలం భద్రతా సిబ్బందికి, అధికారిక బృందాలకు మాత్రమే అక్కడికి వెళ్లే అనుమతి ఉంది. మరి అంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య దొంగతనం ఎలా జరిగింది?’’ అని ఆయన ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa