ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువ ఆప‌ద మిత్రుల‌తో స‌మాజానికి భ‌రోసా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 09:37 PM

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో యువ ఆప‌ద మిత్రులు ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌ర్ల పాప‌య్య గారు అన్నారు. వ‌ర‌ద‌లు, అగ్ని ప్ర‌మాదాలు ఇలా ప్ర‌మాద స‌మ‌యంలో స్థానికంగా ఉండే మీరే తక్షణ సహాయం అందించే సమర్థ నాయ‌కులుగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.  “యువ ఆపద మిత్ర”  మూడవ బ్యాచ్ శిక్ష‌ణ‌ను హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రారంభించి ప్ర‌సంగించారు.  ఫిబ్రవరి 18 నుంచి 24 వ తేదీ వ‌ర‌కూ హైడ్రా ఇచ్చే శిక్ష‌ణ‌లో ఆప‌ద స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఎలా ర‌క్షించాల‌నే మెలుకువ‌ల‌న్నీ నేర్ప‌డ‌మౌతుంద‌న్నారు. స్థానికంగా ఉంటారు..  ప్ర‌మాద స‌మ‌యంలో రెస్పాండ్ అయ్యే మొట్ట‌మొద‌టి వ్య‌క్తులుగా  ఓ వైపు సేవ‌లందిస్తూనే.. మ‌రోవైపు వివిధ శాఖ‌ల నుంచి వ‌చ్చిన స‌హాయ‌క బృందాల‌తో క‌ల‌సి ప‌ని చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఇక్క‌డ శిక్ష‌ణ తీసుకున్న‌వారు మ‌రో 10 మందిని సిద్ధం చేసి.. మేమున్నామ‌నే భ‌రోసా స్థానికంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌ని సూచించారు.  రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల‌కు చెందిన 105 మంది యువ వాలంటీర్లు వారం రోజుల పాటు ఫ‌తుల్‌గూడ‌లోని హైడ్రా శిక్ష‌ణ కేంద్రంలో శిక్ష‌ణ పొందుతున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో ఎలా స్పందించాలి?  ప్రాణాల‌ను ఎలా కాపాడాలి? ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి? ప్రమాద సమయంలో గందరగోళంలో ఎలా నాయకత్వం వహించాలి? త‌దితర అంశాల‌పై శిక్ష‌ణ ఉంటుంద‌న్నారు. హైడ్రా ఆర్ ఎఫ్‌వో శ్రీ జ‌య‌ప్ర‌కాశ్ గారు, డీఎప్‌వో శ్రీ గౌత‌మ్ గారు, ఎస్‌డీఎంఏ నోడ‌ల్ ఆఫీస‌ర్ గౌతం గారు,  హైద‌రాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీస‌ర్ ఖుష్బూ, ఏడీఎఫ్‌వో శ్రీ‌ మోహ‌న‌రావు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని యువ ఆప‌ద మిత్ర వాలంటీర్ల‌నుద్దేశించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా హైడ్రా కార్య‌క్ర‌మాల‌పై వివిధ క‌ళాశాల‌ల నుంచి వ‌చ్చిన విద్యార్థులు మాట్లాడారు. చెరువుల అభివృద్ధితో వ‌ర‌ద‌లు లేని న‌గ‌రం చూడాల‌ని మేమంతా కోరుకుంటున్నామ‌ని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa