ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత పథకాలపై అసహనం వ్యక్తపరిచిన సుప్రీంకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 05:24 PM

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకమవుతాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్తు ఇవ్వడం కన్నా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టిపై దృష్టి సారించాలని సూచించింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ ఉచిత విద్యుత్తు ప్రకటనపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. వినియోగదారుల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వంపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఉచిత విద్యుత్తును ఎలా అందిస్తారని ప్రశ్నించింది.చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతోందని... అయినప్పటికే ఉచిత పథకాల పంపిణీ జరుగుతోందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ఉచిత పథకాల వల్ల దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. సంక్షేమ పథకాల్లో భాగంగా కరెంట్ బిల్లులు చెల్లించలేని వారికి ఉచిత విద్యుత్ అందిస్తామంటే ఒక అర్థం ఉంటుందని... కానీ, మీరు ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఆహారం, విద్యుత్ ఇలా అన్నీ ఫ్రీగా ఇస్తూ... మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామని ప్రశ్నించింది. ఎన్నికలకు ముందే రాష్ట్రాలు ఇలాంటి ఉచిత పథకాలను ఎందుకు తీసుకొస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో అన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే... అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa