ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రులు, ఐఏఎస్‍ల అవినీతి లెక్కలు సేకరిస్తున్నాం..,, బండి సంజయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 10:46 PM

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. త్వరలోనే వివరాలు సేకరించి.. అవినీతి చిట్టాను బహిర్గతం చేస్తానని పేర్కొన్నారు. ఇక మంత్రులకు కొందరు ఐఏఎస్‌లు సహకరిస్తున్నారని.. వారి అవినీతి దందాలు కూడా త్వరలోనే బయటికి తెస్తానని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. వారి సంగతి చూస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు.


మంత్రుల అవినీతికి కొంతమంది ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. అతి త్వరలోనే మంత్రుల కమీషన్ల చిట్టా.. ఐఏఎస్ అధికారుల దందాలను బయటపెడతామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరే వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతోందని పేర్కొన్న బండి సంజయ్.. ఐఏఎస్ అధికారులారా ఖబడ్డార్ అని హెచ్చరించారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఉండదని జోస్యం చెప్పారు.


మంత్రి పదవి ఉందన్న అహంకారంతో బీజేపీని అడ్డుకోవాలని భావిస్తే.. వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని తెలిపారు. మంత్రుల మెడలు వంచి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేలా చేస్తామని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే దిక్కు అని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు


గత 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో జీహెచ్ఎంసీ పరిధిలో తట్ట మొరం కూడా పోసిన దాఖలాలు లేవని.. హైదరాబాద్ నగర ప్రజలు అందరూ ఏకమై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్పిందన్న బండి సంజయ్.. ఆ డబ్బులన్నీ ఎటుపోయాయని ప్రశ్నించారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. ఎన్ని యూనిట్లు మొదలుపెట్టారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు దావోస్‌కు వెళ్లి తెలంగాణలో రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారని.. వాటి ద్వారా ఇప్పటిదాకా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.


ఇది టీపీసీసీ కాదని టీ4సీ (తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్, కాంగ్రెస్) అని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌ ఎన్నికల్లో నగరవాసులు కాంగ్రెస్‍ పార్టీని మూసీ నదిలో పడేయడం ఖాయమన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలు 2 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీయాలని హైదరాబాద్ ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి మూటలు పంపించడానికే ఉన్నారని.. అంతే తప్ప తెలంగాణ అభివృద్ధికి చేసిందేమి లేదని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారి ఉసురు తీసుకున్నారని.. అవి ప్రశ్నిస్తున్న వృద్ధులను జైలులో వేసేందుకు సిగ్గు లేదా అని మండిపడ్డారు.


బీజేపీకి వ్యతిరేకంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేశాయని బండి సంజయ్ ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ ప్రజలు మాత్రం వారి చెంప చెళ్లుమనిపించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా కరీంనగర్ కార్పొరేషన్‍లో కుట్రలు చేశారని.. గెలిచిన కార్పొరేటర్లకు బ్లాంక్ చెక్కులు, కార్లను ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పెద్ద నేతలు ఈ కుట్రలో భాగంగా ఉన్నారని మండిపడ్డారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా జీహెచ్ఎంసీని విభజించడంపై బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ, అఖిలపక్ష సమావేశం, ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీని ఎందుకు 3 కార్పొరేషన్లు చేశారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి భయపడి.. హైదరాబాద్‌లో హిందూ ఓట్లను చీల్చేందుకే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారని విమర్శించారు. 1.5 కోట్ల జనాభా.. రూ.40 వేల కోట్ల బడ్జెట్ ఉన్న ముంబై.. 2 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్లను విభజించలేదని గుర్తు చేసిన బండి సంజయ్... జీహెచ్ఎంసీని ఎందుకు ముక్కలు చేశారని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని రేవంత్ రెడ్డి ముక్కలు చేశారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa