ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్ ఏర్పాటు చేస్తాం: రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 06:13 PM

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు (ఏఐ సమ్మిట్)కు దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచం దూసుకెళ్తోందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. అందులో ఏఐ రాకతో మరింత వేగం పెరిగిందని తెలిపారు. అదే సమయంలో ఈ ఏఐ టెక్నాలజీలో భారత్ కూడా పరుగులు పెట్టాలంటే దాని కోసం కేంద్ర ప్రభుత్వంలో స్పెషల్‌గా ఒక మంత్రిత్వ శాఖను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఏఐ వినియోగం, కంట్రోల్, మార్గదర్శకాలు, నేషనల్ సెక్యూరిటీ వంటి అంశాలను ఈ మంత్రిత్వ శాఖ అత్యవసరం అని పేర్కొన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజాలన్నీ ఈ ఏఐ సదస్సుకు వచ్చాయని.. మనం చేసే ఆలోచనలే జీవితాలు మార్చేస్తాయని తెలిపారు. మనుషుల కంటే ఏఐకి మరిన్ని ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


సమాజంలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఏ విధంగా మార్చాయో.. ఇప్పుడు ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక టెక్నాలజీ అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఏఐ కేవలం ఇంకో టెక్నాలజీ మాత్రమే కాదని.. మానవ పరిణామ క్రమంలో చాలా కీలక మలుపు అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న మెషీన్లు, టెక్నాలజీల లాగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని.. సమాచారాన్ని విశ్లేషించగలదని.. దానికి అనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుందని వెల్లడించారు.


అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీలో పోటీ మొదలైందని.. ఏఐలో కొన్ని దేశాలు, కంపెనీలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో పారిశ్రామిక విప్లవాల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్.. ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని ముందస్తు జాగ్రత్తలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సర్వీసులు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అప్రతిహత విజయాలు దక్కించుకున్న భారత్.. ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.


భారత్‌కు నేషనల్ ఏఐ రోడ్‌మ్యాప్ చాలా అత్యవసరమని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏఐ డెవలప్‌మెట్‌కు సంబంధించి ప్రతీ దశలో సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫామ్‌లు, అప్లికేషన్లు వంటి స్పష్టమైన వ్యూహాలతో భారత్ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రపంచంలో ఏఐ తెస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే హైదరాబాద్‌లో అలాంటి ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరల్డ్ క్లాస్ రీసెర్చ్‌లు చేసేందుకు దేశంలో ఏఐ యూనివర్సిటీని నెలకొల్పాలని సూచించారు.


ఏఐ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతపై వస్తున్న ఆందోళనలను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐ కారణంగా కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు. అదే సమయంలో మనం కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడం, ఉన్న వాటిని అప్ గ్రేడ్ చేసుకోవడం ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ స్టార్టప్‌లకు సపోర్టు చేసేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దేశవ్యాప్త ఏఐ ఆవిష్కరణల కోసం ఏఐ స్టార్టప్ విలేజ్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa