ఒకప్పుడు పోస్టల్ సర్వీసులు ప్రజలకు ఎంతో ఉపయోగపడేవి. లేఖలు, డబ్బులు, వస్తువులు పంపించేందుకు గతంలో తపాలా శాఖ పైనే ప్రజలు ఆధారపడేవారు. రవాణా సౌకర్యాలు పెరగడం, ఇంటర్నెట్, ఫోన్లు, బ్యాంకులు అందుబాటులోకి రావడంతో పోస్టల్ సర్వీసులకు కాలం చెల్లింది. దీంతో తపాలా శాఖ కూడా కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుని.. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా అప్‌డేట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అందుబాటులో మరిన్ని సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇక నుంచి రాత్రిపూట కూడా పోస్టల్ సేవలను ప్రజలకు అందించాలని నిర్ణయించింది.
పోస్టల్ సేవలు నిరంతరాయంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయి. తపాలశాఖను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది. గతానికి భిన్నంగా రాత్రి పూట కూడా పనిచేస్తూ ‘సదా మీ సేవలో’ అంటున్నారు పోస్టల్ సిబ్బంది. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు అత్యవసరంగా పంపించే స్పీడ్ పోస్టులను మరింత త్వరగా చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేటి ఆధునిక యుగంలో దూసుకుపోతున్న ప్రైవేట్ ఆన్‌లైన్ డెలివరీ వ్యవస్థలతో పోటీపడుతూ ప్రజల ముంగిట నిలుస్తోంది.
నైట్ సర్వీస్
అయితే దాదాపు 5 నెలల క్రితమే పోస్టల్ శాఖ.. రిజిస్టర్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ రిజిస్టర్ సేవలను స్పీడ్ పోస్ట్ సేవల్లో విలీనం చేసింది. మరోవైపు.. ఇప్పటివరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోస్టల్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. కానీ ఇక ఈ స్పీడ్ పోస్ట్ సేవలను రాత్రి మొత్తం నిర్వహించేందుకు భారతీయ తపాల శాఖ ప్రయోగాత్మకంగా నైట్ సర్వీస్ సేవలను మొదలుపెట్టింది. ఈ నైట్ సర్వీసుల్లో భాగంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 వరకు స్పీడ్ పోస్ట్ సేవలను అందిస్తున్నారు.
ఇప్పటికే గతేడాది అక్టోబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని అబిడ్స్ జనరల్ పోస్టాఫీస్‌లో ఈ నైట్ స్పీడ్ పోస్ట్ సేవలు ప్రారంభం కాగా.. అవి ప్రస్తుతం మరింత చురుగ్గా సాగుతున్నాయి. స్పీడ్ పోస్ట్ ద్వారా పార్సిల్‌ను బుక్ చేసుకున్న వినియోగదారులు.. వాటిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అబిడ్స్ జీపీఓలో రాత్రి 8 గంటల నుంచి ఆ తర్వాతి రోజు ఉదయం 8 గంటల వరకు.. ఒక తపాలా ఉద్యోగి.. స్పీడ్ పోస్ట్‌ల కోసం వచ్చే ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఇక స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం తీసుకునే ఫీజును కేవలం ఆన్‌లైన్ పద్దతిలోనే తీసుకుంటున్నారు. క్యాష్ చెల్లింపులను పూర్తిగా రద్దు చేశారు. అదే సమయంలో పోస్టాఫీసుకు రాత్రి పూట ఎంతమంది ప్రజలు వస్తున్నారు.. వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయి అనేవి సీసీటీవీల ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాత్రిపూట బుక్ చేసుకున్న డెలివరీలను 48 గంటల్లోగా వాటి గమ్య స్థానాలకు చేరవేసే విధంగా తపాలా అధికారులు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa