పిట్లం మండలంలోని రాంపూర్ (కలన్) గ్రామ పంచాయతీలో శనివారం జిల్లా స్థాయి పంచాయతీ అధికారి (డిఎల్పిఓ) ప్రసాదరావు గారు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు కీలక రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌కు రికార్డుల నిర్వహణపై పలు కీలక సూచనలు చేస్తూ, పరిపాలనలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధికి సంబంధించి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన డిఎల్పిఓ, అక్కడ పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అంగన్‌వాడీ టీచర్ ఇందిరతో మాట్లాడి, గర్భిణులు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని సూచించారు. కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు అందించారు.
గ్రామంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రసాదరావు స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకుంటూ, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు నాణ్యతతో సాగేలా చూడాలని, ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిఎల్పిఓ సూచించారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగరాజు, సర్పంచ్ గుంట అనిత-హన్మండ్లు, ఉప సర్పంచ్ మందడి శ్రీధర్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa