ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో జనగణన.. మే 11 నుంచి జూన్ 9 వరకు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 08:07 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జనగణన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజా కేబినెట్ భేటీలో కీలక ఆమోదం కల్పించింది. తెలంగాణలో జనగణను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సర్వసన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే జనగణన ప్రక్రియకు సంబంధించి.. తాజాగా కీలక నిర్ణయాలకు బీజం పడింది.


నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనగణన ప్రక్రియలో జరగాల్సిన తొలి విడత ఇళ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై ఈ మంత్రి వర్గ సమావేశంలోనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఈ ఇండ్ల గణన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రివర్గానికి వివరించారు. మే 11వ తేదీన ఈ ఇండ్ల గణన ప్రక్రియను ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు పూర్తి చేసేలా ప్లాన్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.


ఈ ఇళ్ల గణన (హౌజ్ లిస్టింగ్) ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేసిన 34 ప్రశ్నలతో కూడిన నమూనా పత్రాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించనుంది. ఈ ఇళ్ల గణనలో సుమారు 84 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించనున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంటికి వెళ్లి వారి వివరాలు సేకరించనున్నారు. ఈ ఎన్యూమరేటర్లకు దిశానిర్దేశం చేసేందుకు 5 వేల మంది నోడల్ ఆఫీసర్లను కూడా నియమించనున్నారు. దీంతో మొత్తంగా ఈ ఇళ్ల గణన ప్రక్రియలో 89 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు.


ఇక తొలి దశ ఇళ్ల గణన సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయిన తర్వాత.. అసలైన రెండో దశ ప్రారంభం కానుంది. జనగణన ప్రక్రియను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో చేపట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంచనాకు.. ఈ గణన ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈ జనగణన ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa