ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రీ హలీమ్ ఆఫర్‌కు ఎగబడిన వందల మంది జనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 08:09 PM

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో ఎక్కడ చూసినా ఇప్పుడు హలీమ్ హాట్ టాపిక్‌గా మారింది. నగరంలో గల్లీ నుంచి మెయిన్ సెంటర్ వరకు వేల సంఖ్యలో హలీమ్ విక్రయాలు కొనసాగుతున్నాయి. రంజాన్ మాసంలో దొరికే హలీమ్ కోసం నగరవాసులు ఎగబడుతున్నారు. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు హోటల్‌లు కూడా భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్.. రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ఉచితంగా హలీమ్ అందించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అయింది.


హైదరాబాద్ నగరంలోని వాహ్ మండి అనే రెస్టారెంట్ యాజమాన్యం.. రంజాన్ వేళ ఫ్రీ హలీమ్ ఆఫర్ పెట్టింది. పబ్లిసిటీ స్టంట్గా ఆ వాహ్ మండి రెస్టారెంట్ చేసిన ఉచిత ప్రకటనతో తీవ్ర గందరగోళానికి దారితీసింది. మటన్ హలీమ్ ఫ్రీగా ఇస్తామన్న యాడ్‌తో వందల సంఖ్యలో నగరవాసులు ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో తీవ్ర వైరల్‌ అవుతోంది. వాహ్ మండి ముందు వందల సంఖ్యలో నగరవాసులు బారులు తీరారు.


ఫ్రీ హలీమ్ కోసం జనాలు ఒకరిని తోసుకుంటూ పరుగులు తీస్తుండటం ఆ వీడియోల్లో కనిపిస్తుంది. కొంతమంది చిన్న చిన్న పిల్లలను కూడా తమ వెంట పెట్టుకుని ఆ హోటల్‌కు రావడంతో అక్కడి పరిస్థితి తీవ్రంగా మారింది. ఇక తండోపతండాలుగా వచ్చిన జనాలను కంట్రోల్ చేయటం ఆ హోటల్ సిబ్బంది వల్ల కాలేదు. దీంతో అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. జనాలను నియంత్రించేందుకు హోటల్ యాజమాన్యం స్పెషల్‌గా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినా పరిస్థితి చేయి దాటిపోయింది.


ఈ ఫ్రీ హలీమ్‌కు జనాలు ఎగబడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోయినా, గాయాల పాలైనా పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. తొక్కిసలాటలు జరిగితే తిరిగి ప్రభుత్వాన్ని, అధికారులపై విమర్శలు గుప్పిస్తారని మండిపడ్డారు. ఇలాంటి ఫ్రీ ఆఫర్ల వల్ల గతంలో జరిగిన రచ్చ చాలదా మళ్లీ ఇప్పుడు అవసరమా అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జనాలు మరీ ఇంత ఖాళీగా ఉన్నారా.. ఫ్రీగా వస్తే వందల సంఖ్యలో ఎగబడతారా అని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసేటపుడు ముందస్తుగా భద్రతా చర్యలు, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa