బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన 'రైతు సంఘర్షణ' సభలో ఆమె మాట్లాడుతూ, తనకు జోగులాంబ అమ్మవారు సెంటిమెంట్ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ కార్యక్రమం మొదలైనా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువగా ప్రారంభమయ్యేదని అన్నారు.కానీ భవిష్యత్తులో మనం ఏర్పాటు చేయబోయే పార్టీ మొదలు అన్నీ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇక్కడి నడిగడ్డ ప్రజలు నిజాయతీపరులని, అలాగే ఈ గడ్డపై నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని అన్నారు. పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్నారు కానీ కష్టపడి పనిచేసే రైతులకు ఇవ్వడం లేదని విమర్శించారు.జోగులాంబ అమ్మవారి దయతో గద్వాల జిల్లా నుంచే తెలంగాణ జాగృతి జైత్రయాత్ర ప్రారంభమైందని అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీని తాము గెలుచుకున్నామని వెల్లడించారు. కానీ వడ్డేపల్లిలో తాము గెలిచిన తర్వాత తమ వారిని అధికార పార్టీ వారు దగ్గరకు తీసుకున్నారని మండిపడ్డారు. అసలు గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని సవాల్ చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని వారు ఎమ్మెల్యేగా ఉన్నారని మండిపడ్డారు.సమాధానం చెప్పకుంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేస్తే ఆ మరుక్షణం తాను ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ, ధైర్యం ఉండాలని వ్యాఖ్యానించారు. మన ప్రాంతం నుంచే నీళ్లు పోతున్నాయి కానీ మనకు మాత్రం అందడం లేదని అన్నారు.నడిగడ్డ ప్రాంతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిందేమీ లేదని అన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రభుత్వాలతో పని చేయించడం కోసమే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరు ఏమిచ్చినా తీసుకోవాలని, కానీ పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు.త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయని, అప్పుడు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని, కానీ మీకోసం కొట్లాడే జాగృతి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఈ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa