తెలుగు రాష్ట్రాల మధ్య రహదారి రవాణా వ్యవస్థలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేని మే నెలలో ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ప్రస్తుతం సూర్యాపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మొత్తం 162 కిలోమీటర్ల పొడవున రూ.4,451.87 కోట్ల వ్యయంతో ఈ రహదారిని అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించారు. 95 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.ఈ హైవే అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ATMS) ద్వారా ప్రతి 2 కిలోమీటర్లకు ఒక 360-డిగ్రీల సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను ఈ కెమెరాలు గుర్తించి ఆటోమేటిక్‌గా చలాన్లు జారీ చేస్తాయి. రహదారిపైకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించారో, ఆ దూరానికే టోల్ వసూలు చేస్తారు. ఇందుకోసం కేవలం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చోట హోటళ్లు, వాష్‌రూమ్‌లు, పెట్రోల్ బంకులతో కూడిన "వే సైడ్ ఎమినిటీస్" నిర్మిస్తున్నారు. రోడ్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంకుల వివరాలు తెలుసుకోవచ్చు. రహదారి పొడవునా సోలార్ ప్యానెల్స్‌తో కూడిన ఆటోమేటిక్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa