ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ బంగారు బిస్కెట్లు ఇచ్చి, రూ.1.6 కోట్ల విలువైన నగలు కాజేశాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 06:15 PM

హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ బంగారు బిస్కెట్లు ఇచ్చి, అసలైన నగలను కాజేశాడో ఓ కేటుగాడు. తనపై నమ్మకం కలగడానికి ముందు మూడుసార్లు కొద్ది మొత్తంలో అసలైన బంగారు బిస్కెట్లను ఇచ్చి, నగలు తీసుకున్నాడు. కానీ, నాలుగోసారి మాత్రం ఆమెను నిండా ముంచేసి, కోటిన్నరకుపైగా బంగారు నగలను కాజేశాడు. బిస్కెట్లు సంఖ్య ఎక్కువ ఉండటంతో అనుమానం వచ్చిన జ్యువెలరీ షాపు యజమానురాలు.. పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.


వివరాల్లోకి వెళ్తే.. చెందిన లక్ష్మీ కావ్య అనే మహిళ బంజారాహిల్స్‌లో నగల దుకాణం నిర్వహిస్తోంది. కొన్నాళ్ల కిందట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కాచిగూడకు చెందిన శ్రీనాథ్ రాఠీ అలియాస్ అంకిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఆంధ్రప్రదేశ్‌కు చెంది ఓ ప్రముఖుడి వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో తమ వద్ద బంగారు బిస్కెట్లు పెద్ద మొత్తంలో ఉన్నాయని, వాటికి బదులుగా తమకు నగలు ఇవ్వాలని అడిగాడు .


మొదట్లో ఈ ప్రతిపాదనను బాధితురాలు లైట్ తీసుకుంది. కానీ, పదేపదే రిక్వెస్ట్ చేయడంతో సరేనంది. తనపై నమ్మకం కలగడానికి మూడు సార్లు అసలైన గోల్డ్‌ బిస్కెట్లు ఇచ్చి.. వాటికి సమానంగా నగలు తీసుకెళ్లాడు. దీంతో నిందితుడిపై లక్ష్మీ కావ్యకు నమ్మకం కలిగింది. అయితే, ఇక్కడే ఆమె అతడి ట్రాప్‌లో పడిపోయింది. ఫిబ్రవరి 25న నిందితుడు శ్రీనాథ్ రూ.1.61 కోట్లు విలువైన కిలో బంగారు నగలను తీసుకున్నాడు. తాను పనిమీద బయటకు వెళ్తున్నానని, తన అసిస్టెంట్ కృష్ణతో బిస్కెట్లు పంపిస్తున్నానని చెప్పాడు.


బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో అదే రోజు బంగారు బిస్కెట్లను అతడి అసిస్టెంట్‌గా చెప్పిన కృష్ణ తీసుకొచ్చి ఇచ్చాడు. వాటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో లక్ష్మీకావ్యకు అనుమానం వచ్చి పరీక్షించడంతో నకిలీ బిస్కెట్లని తేలింది. వెంటనే శ్రీనాథ్‌‌కు ఫోన్ చేయగా.. అది స్విఛ్ఛాఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించింది. బిస్కెట్లు తీసుకొచ్చిన యువకుడ్ని నిలదీస్తే తనను నాలుగు రోజుల కిందటే పనిలో పెట్టుకున్నాడని చెప్పాడు, సోమాజిగూడలోని ఓ హోటల్‌లో తనకు వసతి కల్పించాడని వివరించాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నట్టు విచారణలో గుర్తించారు. ఐదేళ్ల కిందట యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. తాను కామర్స్ లెక్చరర్‌ని చెప్పుకుని పలువురు సీఏ విద్యార్థులకు క్లాస్‌లు బోధించాడు. బిజినెస్ పెట్టుబడి పేరుతో చాలా మంది నుంచి రూ.2.48 కోట్లు వసూలు చేసి పరారైనట్టు విచారణలో తేలింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa